Maruti eVitara: భారతదేశంలో తయారై ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్న మారుతి సుజుకి తొలి గ్లోబల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇ-విటారా అంతర్జాతీయ వేదికపై మరో ఘనత సాధించింది. జపాన్‌లో నిర్వహించిన 2026 సేఫ్టీ టెస్ట్‌లో భాగంగా జపాన్ ఎన్ క్యాప్ నిర్వహించిన కఠినమైన క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. ఇప్పటికే భారత్‌లో నిర్వహించిన భారత్ ఎన్‌కాప్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించిన ఈ ఎస్‌యూవీ, ఆస్ట్రేలియా ఏఎన్‌సీఏపీ టెస్ట్‌లోనూ 4 స్టార్‌లు సొంతం చేసుకుంది. భారత్‌లో తయారవుతున్న ఒక ఎలక్ట్రిక్ కారు అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలను అందుకోవడం దేశానికే గర్వకారణంగా నిలిచింది.

జపాన్ ఎన్‌ క్యాప్ క్రాష్ టెస్ట్ ఫలితాలు

జపాన్ సేఫ్టీ టెస్ట్‌లో కారు నిర్మాణ పటుత్వంతో పాటు ప్రమాదాల నివారణ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రాష్ టెస్ట్‌లో మారుతి ఇ-విటారా ముందు నుంచి జరిగిన ఢీకొనే పరీక్షల్లో డ్రైవర్ రక్షణ కోసం 5 కి గాను 5 స్థాయిలను దక్కించుకుంది. అలాగే సైడ్ నుంచి జరిగిన ఢీకొట్టే పరీక్షల్లోనూ ఈ ఎస్‌యూవీ అత్యుత్తమంగా రాణించి లెవెల్ 5 రేటింగ్ సాధించింది. పాదచారుల రక్షణ, రాత్రి సమయంలో ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి అధునాతన ఫీచర్లలో కూడా ఈ కారు అత్యధిక మార్కులు సాధించి తన భద్రతా ప్రమాణాలను నిరూపించుకుంది.

వేరియంట్లు, బ్యాటరీ అలాగే డ్రైవింగ్ రేంజ్

భారతీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డెల్టా, జెటా అలాగే ఆల్ఫా వంటి వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర సుమారు రూ. 16.19 లక్షల నుంచి రూ. 20.21 లక్షల వరకు ఉంది. కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా ఇందులో 49kWh అలాగే 61kWh కెపాసిటీ గల రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 543 కిలోమీటర్ల దూరం ప్రయాణించే అద్భుతమైన రేంజ్‌ను ఈ కారు అందిస్తుండటం విశేషం.

గ్లోబల్ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా కార్ల హవా

మారుతి సుజుకి సంస్థ దేశీయంగానే ఈ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తోంది. పర్యావరణ హితమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు అత్యాధునిక టెక్నాలజీ, పటిష్టమైన భద్రతా ప్రమాణాలను మేళవించి తయారు చేయడం వల్ల ఈ వాహనానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఈ విజయంతో భారతీయ ఆటోమొబైల్ రంగం గ్లోబల్ మార్కెట్‌లో మరో మెట్టు ఎక్కిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story