సెప్టెంబర్లో భారీగా పెరిగిన ఎగుమతులు

Made-in-India Vehicles : భారతదేశం నుండి వాహనాల ఎగుమతులు సెప్టెంబర్ త్రైమాసికంలో గత సంవత్సరం కంటే 26 శాతం పెరిగాయి. ఈ మూడు నెలల్లో, ఎగుమతుల విషయంలో టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్లు ఇప్పటి వరకు అత్యధిక సంఖ్యను చేరుకున్నాయి. వాహన తయారీదారుల సంస్థ సియామ్ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ గణాంకాలు భారతదేశంలో తయారైన వాహనాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న బ్రాండ్ ఆమోదాన్ని సూచిస్తున్నాయి. మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తుల పట్ల విదేశీ కొనుగోలుదారుల విశ్వాసం పెరుగుతోందని ఇది స్పష్టం చేస్తోంది.

ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో భారీ వృద్ధి

సోసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సియామ్) గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ త్రైమాసికంలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతి 23 శాతం పెరిగి 2,41,554 యూనిట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే మూడు నెలల్లో ఈ సంఖ్య 1,96,196 యూనిట్లుగా ఉంది. రెండో త్రైమాసికంలో కార్ల ఎగుమతి 20.5 శాతం పెరిగి 1,25,513 యూనిట్లకు చేరింది, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 1,04,196 యూనిట్లుగా నమోదైంది.

అదే విధంగా, జూలై-సెప్టెంబర్ కాలంలో యుటిలిటీ వాహనాల ఎగుమతి వార్షిక ప్రాతిపదికన 26 శాతం పెరిగి 1,13,374 యూనిట్లకు చేరింది. వ్యాన్‌ల ఎగుమతి కూడా వార్షిక ప్రాతిపదికన 39 శాతం పెరిగి 2,667 యూనిట్లకు చేరుకుంది. ఎగుమతులలో మారుతి సుజుకి ఇండియా 2,05,763 యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా 99,540 యూనిట్లతో రెండో స్థానంలో ఉంది.

టూ వీలర్లకు విపరీతమైన డిమాండ్

జూలై-సెప్టెంబర్ కాలంలో టూ వీలర్ల ఎగుమతి 25 శాతం పెరిగి 12,95,468 యూనిట్లకు చేరుకుంది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో ఇది 10,35,997 యూనిట్లుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో స్కూటర్ల ఎగుమతి 12 శాతం పెరిగి 1,77,957 యూనిట్లకు చేరగా, మోటార్‌సైకిళ్ల ఎగుమతి 27 శాతం పెరిగి 11,08,109 యూనిట్లకు పెరిగింది. మోపెడ్‌ల ఎగుమతి రెండో త్రైమాసికంలో 9,402 యూనిట్లకు పెరిగింది, గత సంవత్సరం ఇదే కాలంలో ఇది 2,028 యూనిట్లుగా ఉంది.

కమర్షియల్ వెహికల్స్‎కు కూడా పెరిగిన డిమాండ్

ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం కమర్షియల్ వెహికల్స్ ఎగుమతి వార్షిక ప్రాతిపదికన 22 శాతం పెరిగి 24,011 యూనిట్లకు చేరింది. అదే విధంగా, సెప్టెంబర్ త్రైమాసికంలో త్రీ వీలర్ల ఎగుమతి 51 శాతం పెరిగి 1,23,480 యూనిట్లకు చేరింది.

రెండో త్రైమాసికంలో మొత్తం వాహనాల ఎగుమతి 26 శాతం పెరిగి 16,85,761 యూనిట్లకు చేరుకుంది, గత సంవత్సరం ఇదే కాలంలో ఇది 13,35,343 యూనిట్లుగా ఉంది. సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. రెండో త్రైమాసికంలో అన్ని రంగాలలో బలమైన ఎగుమతి వృద్ధి భారతదేశంలో తయారైన వాహనాలకు పెరుగుతున్న బ్రాండ్ ఆమోదం, నమ్మకాన్ని సూచిస్తుందని చెప్పారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story