ఇక కొత్త ఎలక్ట్రిక్ కార్లు, ఎక్కువ ఆప్షన్లు

Mahindra : భారతదేశ ఎస్‌యూవీ మార్కెట్‌లో కింగ్‌గా ఉన్న మహింద్రా అండ్ మహింద్రా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో కూడా సత్తా చాటాలని చూస్తోంది. అందుకే, గతేడాది విడుదల చేసిన BE 6, XEV 9e అనే రెండు ఎలక్ట్రిక్ కార్ల పోర్ట్‌ఫోలియోను విస్తరించబోతోంది. ఈ కార్లు ఇండియాలో మంచి విజయం సాధించి, మహింద్రాను మూడవ అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల విక్రేతగా మార్చాయి. BE 6, XEV 9e కార్లు ప్రస్తుతం మూడు వేరియంట్లలో వస్తున్నాయి. ప్యాక్ వన్ , ప్యాక్ టూ, ప్యాక్ త్రీ. వీటిలో ఎంట్రీ-లెవల్ వేరియంట్ మినహా మిగతా రెండింటిలో 59 kWh, 79 kWh రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి.

టాప్ మోడల్స్ అయిన Pack Three, Pack Three Select ఇప్పుడు రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తాయి. ఇంతకుముందు Pack Three Select కేవలం 59 kWh బ్యాటరీతో మాత్రమే లభించేది, ఇప్పుడు 79 kWh బ్యాటరీతో కూడా వస్తుంది. అలాగే, అన్ని ఫీచర్లతో కూడిన Pack Three ఇప్పుడు చిన్న 59 kWh బ్యాటరీతో కూడా లభిస్తుంది. మహింద్రా ఈ మార్పులతో ప్రతి కస్టమర్ అవసరాన్ని తీర్చాలని చూస్తోంది. ఎక్కువ రేంజ్ కావాలనుకునే వారికి తక్కువ ఫీచర్లతో పెద్ద బ్యాటరీ ప్యాక్, లేదా ఎక్కువ ఫీచర్లు కావాలనుకునే వారికి చిన్న బ్యాటరీ ప్యాక్‌తో ఫుల్-లోడెడ్ వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. ఇటీవల Pack Two వేరియంట్‌లో కూడా 79 kWh బ్యాటరీ ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. ఎందుకంటే చాలా మంది కొనుగోలుదారులు ఎక్కువ రేంజ్ కోరుకుంటున్నారు కానీ ఎక్కువ ఫీచర్లు అవసరం లేదు.

59 kWh బ్యాటరీ 228 bhp పవర్ ఇస్తుంది. 79 kWh బ్యాటరీ 281 bhp పవర్ ఇస్తుంది. రెండు బ్యాటరీల టార్క్ 380 Nm, రెండు కార్లు రియర్-వీల్-డ్రైవ్ (RWD) అవుతాయి. అలాగే 59 kWh బ్యాటరీ ఉన్న కార్లు 542 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. 79 kWh బ్యాటరీ ఉన్న కార్లు 656 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. మహింద్రా BE 6E బేస్ మోడల్ ధర రూ.18.90 లక్షల నుండి మొదలై, టాప్ మోడల్ ధర రూ.27.65 లక్షల వరకు ఉంటుంది. మహింద్రా XEV 9e బేస్ మోడల్ ధర రూ.21.90 లక్షల నుండి మొదలై, టాప్ మోడల్ ధర రూ.31.25 లక్షల వరకు ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story