బ్యాటరీ తప్పు లేదని తేల్చిన కంపెనీ

Mahindra BE 6 Fire : యూపీలోని హాపూర్ జిల్లా కురానా టోల్ ప్లాజా సమీపంలో మహీంద్రా బిఈ 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో జరిగిన అగ్నిప్రమాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎలక్ట్రిక్ కార్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో, మహీంద్రా కంపెనీ ఈ ఘటనపై వేగంగా స్పందించింది. కారు డేటా, సెన్సార్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అసలు కారణాన్ని వెల్లడిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బులంద్‌షహర్ నుంచి హాపూర్ వైపు వెళ్తున్న మహీంద్రా బిఈ 6 ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం అందరినీ భయాందోళనకు గురిచేసింది. దీనిపై విచారణ చేపట్టిన మహీంద్రా, కారులోని ఆన్-బోర్డ్ సెన్సార్లు, సాఫ్ట్‌వేర్ డయాగ్నోస్టిక్స్ ఆధారంగా నివేదికను విడుదల చేసింది. కారులో ఉన్న హై-వోల్టేజ్ బ్యాటరీ గానీ, ఎలక్ట్రిక్ మోటార్ గానీ ఈ మంటలకు కారణం కాదని కంపెనీ స్పష్టం చేసింది. ఇవి రెండూ పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని, బయట నుంచి మంటలు వ్యాపించినా బ్యాటరీ దెబ్బతినలేదని వెల్లడించింది.

కంపెనీ నివేదిక ప్రకారం.. కారు వెనుక కుడి వైపు టైర్ పూర్తిగా పంక్చర్ అయ్యింది. కారులోని సిస్టమ్ ఈ విషయాన్ని పదేపదే హెచ్చరించినా, డ్రైవర్ ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు. పంక్చర్ అయిన టైర్‌తోనే కారును గంటకు 60 కిలోమీటర్ల వేగంతో దాదాపు 10 నిమిషాల పాటు నడిపారు. దీనివల్ల టైర్ రబ్బరుకు, రోడ్డుకు మధ్య తీవ్రమైన ఘర్షణ ఏర్పడి, విపరీతమైన వేడి పుట్టింది. ఆ వేడి కారణంగా టైర్ రబ్బరు మంటల్లో చిక్కుకుంది.

టైర్ వేడి పెరగడాన్ని గుర్తించిన కారులోని భద్రతా వ్యవస్థలు వెంటనే స్పందించాయి. కారు వేగాన్ని నియంత్రించి, సిస్టమ్‌ను షట్ డౌన్ చేయడం ద్వారా కారును సురక్షితంగా నిలిపివేసింది. దీనివల్ల డ్రైవర్, ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడగలిగారు. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ వల్ల మంటలు వస్తాయన్న అపనమ్మకాన్ని ఈ విచారణ పటాపంచలు చేసింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగిందని కంపెనీ డేటా సాక్ష్యాలతో సహా నిరూపించింది. కస్టమర్లు కారు ఇచ్చే హెచ్చరికలను ఎప్పుడూ విస్మరించకూడదని మహీంద్రా విజ్ఞప్తి చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story