Mahindra Bolero Neo : బొలెరో ఫ్యాన్స్ రెడీ అవ్వండి.. కొత్త మోడల్ వచ్చేస్తోంది
కొత్త మోడల్ వచ్చేస్తోంది

Mahindra Bolero Neo : మహీంద్రా బొలెరో కారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో దీనికి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఇప్పుడు వినియోగదారుల కోసం మరింత మెరుగైన అనుభవాన్ని అందించడానికి మహీంద్రా, అప్‌డేటెడ్ బోలెరో నియో 2025 మోడల్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. తాజాగా ఈ మోడల్ టెస్టింగ్ సమయంలో కనిపించింది.
భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో మహీంద్రా బోలెరో ఒకటి. ఇప్పుడు మహీంద్రా సంస్థ బోలెరో నియో 2025 మోడల్‌ను విడుదల చేయబోతోంది. ఇటీవల ఈ అప్‌డేటెడ్ మోడల్ టెస్టింగ్ సమయంలో తొలిసారిగా కనిపించింది. దీని స్పై షాట్స్ ప్రకారం కారు డిజైన్‌లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, కొన్ని ముఖ్యమైన మార్పులు మాత్రం కనిపిస్తున్నాయి. కారు బాక్సీ డిజైన్, రోడ్డుపై దాని పట్టు పాత మోడల్ లాగే ఉన్నాయి.
కొత్త బొలెరో నియోలో కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్ కనిపిస్తోంది. అయితే, వాటి సైజ్ మాత్రం 15-ఇంచ్ ఉండే అవకాశం ఉంది. వెనుక వైపున టెయిల్‌ల్యాంప్, రూఫ్ స్పాయిలర్, హై మౌంట్ స్టాప్ ల్యాంప్, టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్ పాత మోడల్‌లో ఉన్నట్టే ఉన్నాయి.
అయితే, ముందు భాగంలో మాత్రం చెప్పుకోదగ్గ మార్పులు చేశారు. పాత మోడల్‌లో నిలువుగా ఉండే గ్రిల్ స్లాట్‌లు ఇప్పుడు అడ్డంగా ఉన్నాయి. కొత్త గ్రిల్ డిజైన్ మరింత విశాలంగా మరియు స్టైలిష్‌గా కనిపిస్తోంది. మహీంద్రా ఈ కొత్త మోడల్‌లో అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించే అవకాశం ఉంది. ఈ కారులో 10.2 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, వెంటిలేటెడ్ సీట్లు ఉండవచ్చు. అలాగే, కీ-లెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ ఫీచర్లు కూడా అందించే అవకాశం ఉంది.
ఇంజిన్ విషయంలో మాత్రం పెద్దగా మార్పులు లేవు. ఇందులో 1.5-లీటర్, 3-సిలిండర్ mHawk 100 టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 100 బీహెచ్‌పీ పవర్, 260 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఏఎమ్‌టీ (AMT) గేర్‌బాక్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా, కొత్త బోలెరో నియో 2025 మోడల్ డిజైన్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, ముందు భాగం డిజైన్, ఫీచర్లలో మెరుగ్గా ఉంటుంది. శక్తివంతమైన ఇంజిన్, పటిష్టమైన బాడీ, అప్‌డేటెడ్ ఫీచర్లతో ఈ కారు మరోసారి మార్కెట్‌లో హిట్ అవుతుందని భావిస్తున్నారు.
