Mahindra EV: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతుండటంతో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా భారీ విజయాన్ని అందుకుంది. కంపెనీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల మొత్తం అమ్మకాలు లక్ష యూనిట్ల మైలురాయిని దాటాయి. ఈ ఘనతలో కేవలం కొత్తగా వచ్చిన బార్న్ ఎలక్ట్రిక్ మోడళ్లు మాత్రమే కాకుండా, XUV400 EV, XUV 3XO EV అమ్మకాలు కూడా భాగమయ్యాయి. ముఖ్యంగా 2026 రెండో త్రైమాసికంలో మహీంద్రా XEV 9S ఏకంగా 13,275 యూనిట్లు అమ్ముడై, దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా రికార్డు సృష్టించింది. 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న ఆదరణకు ఇది నిదర్శనంగా నిలిచింది.

2013 నుంచి మొదలైన ఎలక్ట్రిక్ ప్రయాణం

మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల ప్రయాణం ఇప్పటిది కాదు. 2010లో రేవా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలో 55 శాతం వాటాను కొనుగోలు చేసిన మహీంద్రా, 2013లో e2o కారును మార్కెట్లోకి తెచ్చింది. ఆ తర్వాత e-Verito, e2o Plus వంటి మోడళ్లను పరిచయం చేసింది. అయితే 2020 తర్వాత భారతదేశంలో ఈవీలకు అసలైన డిమాండ్ మొదలైంది. ఆ సమయంలో టాటా మోటార్స్ లాంగ్ రేంజ్ కార్లతో మార్కెట్లో పట్టు సాధించగా, మహీంద్రా 2023లో XUV400 EVని విడుదల చేసి గట్టి పోటీనిచ్చింది.

దశ తిప్పిన బార్న్ ఎలక్ట్రిక్ సిరీస్

మహీంద్రా ఈవీ విభాగానికి అసలైన గుర్తింపు మాత్రం కొత్త INGLO ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన బార్న్ ఎలక్ట్రిక్ సిరీస్‌తోనే వచ్చింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై మొదట BE 6, XEV 9e మోడళ్లను విడుదల చేసింది. సాధారణ కార్లకు భిన్నంగా ఉండే షార్ప్ డిజైన్, పెద్ద బ్యాటరీ ప్యాక్, ఎక్కువ రేంజ్, ప్రీమియం క్యాబిన్ ఫీచర్లు కొనుగోలుదారులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత 7-సీటర్ ఆప్షన్‌తో వచ్చిన XEV 9S మార్కెట్లో సంచలనం రేపింది. 59 kWh, 79 kWh బ్యాటరీలతో పాటు కొత్తగా 70 kWh ఆప్షన్‌తో రావడంతో దీనికి వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగింది.

2027లో రాబోతున్న BE 07 ఫ్లాగ్‌షిప్ కారు

తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోరుకునే వారి కోసం కంపెనీ XUV 3XO EVని కూడా అందుబాటులోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లను పోలి ఉండే ఈ కారు సామాన్య కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇక భవిష్యత్తు ప్రణాళికల విషయానికొస్తే, మహీంద్రా త్వరలోనే BE 07 మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. BE 6 కంటే పైస్థాయిలో ఉండే ఈ కారు కంపెనీకి ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా నిలవనుంది. అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన పనితీరుతో రానున్న ఈ కారు 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Next Story