రూ.4,675 కోట్ల లాభంతో మహీంద్రా జోరు

Mahindra : మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి కాలం బాగా కలిసొస్తోంది. స్కార్పియో, థార్ వంటి పవర్‌ఫుల్ ఎస్‌యూవీలతో మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఈ దేశీ దిగ్గజం, లాభాల విషయంలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో మహీంద్రా ఏకంగా 4,675 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గతేడాదితో పోలిస్తే ఇది 47 శాతం వృద్ధి కావడం విశేషం. మహీంద్రా ప్రధానంగా తన ఎస్‌యూవీల మీద నమ్మకంతో ముందుకు వెళుతోంది. ఈ త్రైమాసికంలో కేవలం వాహనాల విభాగం నుంచే రూ.30,370 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 30 శాతం వృద్ధి. మొత్తం 3.02 లక్షల వాహనాలను కంపెనీ విక్రయించింది. ప్రస్తుతం భారత ఎస్‌యూవీ మార్కెట్లో 24.1 శాతం వాటాతో మహీంద్రా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక చిన్న వాణిజ్య వాహనాల (ట్రక్కులు) విభాగంలో అయితే ఏకంగా 51.9 శాతం మార్కెట్ ఆక్రమించి ఏకచక్రాధిపత్యం చలాయిస్తోంది.

కేవలం కార్లే కాకుండా, వ్యవసాయ రంగంలోనూ మహీంద్రాకు ఎదురులేదు. ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల అమ్మకాల ద్వారా రూ.11,501 కోట్ల ఆదాయం పొందింది. ఈ మూడు నెలల్లో 1.50 లక్షల ట్రాక్టర్లను విక్రయించింది. ట్రాక్టర్ మార్కెట్లో కంపెనీకి 44 శాతం వాటా ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం మహీంద్రాకు బాగా కలిసివచ్చింది.

మహీంద్రా గ్రూప్‌కు చెందిన ఇతర సంస్థలు కూడా లాభాల్లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా మహీంద్రా ఫైనాన్స్ లాభం 97 శాతం పెరగడం విశేషం. సుమారు 11 త్రైమాసికాల తర్వాత మహీంద్రా లాజిస్టిక్స్ మళ్లీ లాభాల్లోకి రాగా, మహీంద్రా లైఫ్ స్పేస్(రియల్ ఎస్టేట్) లాభాలు ఏకంగా ఐదు రెట్లు పెరిగాయి. గ్రూప్ సీఈఓ అనీష్ షా మాట్లాడుతూ.. ఈ అద్భుతమైన ఫలితాలు పక్కా ప్లానింగ్, టీమ్ వర్క్ వల్ల సాధ్యమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు.

కంపెనీ ఫలితాలు వెలువడగానే షేర్ మార్కెట్లో మహీంద్రా షేర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఫలితాలకు ముందే 3 శాతం పెరిగిన షేర్, ఆ తర్వాత రూ.3,718 వద్ద ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టింది. కొత్తగా లాంచ్ చేసిన XEV 9S, XUV 7XO మోడళ్లకు కస్టమర్ల నుంచి భారీ స్పందన వస్తోందని, భవిష్యత్తులో లాభాలు మరిన్ని పెరుగుతాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story