ఫీచర్లు చూస్తే ఫ్యాన్ అయిపోవాల్సిందే

Mahindra : మహీంద్రా అండ్ మహీంద్రా తన ఐకానిక్ ఎస్‌యూవీ థార్ రాక్స్‎లో అదిరిపోయే అప్‌డేట్‌తో సరికొత్త స్టార్ ఎడిషన్‎ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. స్టైల్, లగ్జరీకి ప్రాధాన్యత ఇచ్చే కుర్రాళ్ల కోసం ఈ స్పెషల్ ఎడిషన్‌ను పక్కాగా తీర్చిదిద్దారు. దీని ప్రారంభ ధరను రూ.16.85 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. కేవలం లుక్ మాత్రమే కాదు, ఇందులో అందించిన ప్రీమియం ఫీచర్లు కారు లవర్స్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

మహీంద్రా థార్ రాక్స్ 2024లో విడుదలైనప్పటి నుంచి అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు కస్టమర్లకు మరింత ప్రీమియం అనుభూతిని అందించడానికి కంపెనీ స్టార్ ఎడిషన్‎ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్ ముఖ్యంగా విజువల్ అప్‌డేట్స్‌తో ఆకట్టుకుంటోంది. బయటి వైపు చూస్తే ప్యానో-బ్లాక్ ఫినిషింగ్‌తో మెరిసిపోయే గ్రిల్, అలాయ్ వీల్స్ కారుకు ఒక అగ్రెసివ్ లుక్‌ను ఇస్తున్నాయి. ఈ స్పెషల్ ఎడిషన్ సిట్రీన్ ఎల్లో, టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, స్టీల్త్ బ్లాక్ వంటి నాలుగు అద్భుతమైన రంగులలో లభిస్తుంది.

ఇంజిన్, పెర్ఫార్మెన్స్

మెకానికల్ పరంగా చూస్తే, పాత మోడల్ లోని పవర్‌ఫుల్ ఇంజిన్లనే ఇందులోనూ కొనసాగించారు. 2.0-లీటర్ టీజీడీఐ ఎం-స్టాలియన్ పెట్రోల్ ఇంజిన్ 130 kW పవర్, 380 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇక డీజిల్ విషయానికి వస్తే, 2.2-లీటర్ ఎం-హాక్ ఇంజిన్ 128.6 kW పవర్, 400 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అయితే ఈ స్టార్ ఎడిషన్ కేవలం రియర్-వీల్-డ్రైవ్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉందని గమనించాలి. పెట్రోల్ లో మాన్యువల్ గేర్‌బాక్స్ లేదు, కేవలం ఆటోమేటిక్ మాత్రమే ఉంది.

మహీంద్రా ఈ స్టార్ ఎడిషన్‌ను ఆకర్షణీయమైన ధరలతో మార్కెట్లోకి తెచ్చింది.

డీజిల్ మాన్యువల్ (D22): రూ.16.85 లక్షలు.

డీజిల్ ఆటోమేటిక్ (D22): రూ.18.35 లక్షలు.

పెట్రోల్ ఆటోమేటిక్ (G20 TGDi): రూ.17.85 లక్షలు.

లగ్జరీ, టెక్ ఫీచర్లు

థార్ రాక్స్ స్టార్ ఎడిషన్ లోపలి భాగం ఎంతో రిచ్‌గా ఉంటుంది. ఆల్-బ్లాక్ లెదరెట్ సీట్లపై సుయెడ్ టచ్ ఇవ్వడం వల్ల ప్రీమియం ఫీల్ వస్తుంది. వేసవిలో హాయినిచ్చే వెంటిలేటెడ్ సీట్లు, స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్, 60:40 స్ప్లిట్ రిక్లైన్ రియర్ సీట్లు ప్రయాణాన్ని సుఖమయం చేస్తాయి. టెక్నాలజీ పరంగా 26.03 సెంటీమీటర్ల హెచ్‌డీ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 83 కనెక్టెడ్ ఫీచర్లతో కూడిన అడ్రినోక్స్ టెక్నాలజీని అందించారు. ముఖ్యంగా 9-స్పీకర్ల హర్మాన్ కార్డన్ ఆడియో సిస్టమ్ మ్యూజిక్ ప్రియులకు పసందైన విందునిస్తుంది.

భద్రతకు ప్రాధాన్యత

ప్రయాణీకుల రక్షణ విషయంలో మహీంద్రా ఎక్కడా తగ్గలేదు. భారత్ NCAP లో 5-స్టార్ రేటింగ్ సాధించేలా దీనిని డిజైన్ చేశారు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఈ-కాల్, ఎస్ఓఎస్ వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story