Mahindra: సాధారణంగా మహీంద్రా అంటే మనకు ఎస్‌యూవీ కార్లు గుర్తొస్తాయి. కానీ అంతర్జాతీయ రేసింగ్ ట్రాక్‌పై కూడా తన సత్తా చాటేందుకు కంపెనీ సిద్ధమైంది. 2027 ఫార్ములా ఈ సీజన్ కోసం మహీంద్రా రేసింగ్ కొత్త ఎలక్ట్రిక్ రేసింగ్ కారును ఆవిష్కరించింది. M13Electro పేరుతో వచ్చిన ఈ కారు జెన్-4 టెక్నాలజీతో రూపొందింది. 804 bhp పవర్, గంటకు 335 కిలోమీటర్ల టాప్ స్పీడ్ దీని ప్రత్యేకతలు. మరీ ముఖ్యంగా కేవలం 1.8 సెకన్లలోనే 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు.

2027 ఫార్ములా ఈ కోసం కొత్త కారు

మహీంద్రా రేసింగ్ తన కొత్త M13Electro కారును డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది. 2027 ఫార్ములా ఈ సీజన్‌లో ఈ కారు రేసింగ్ ట్రాక్‌పైకి దిగనుంది. జెన్-4 నిబంధనలకు అనుగుణంగా దీన్ని పూర్తిగా కొత్త సాంకేతికతతో రూపొందించారు. కారు డ్రైవ్‌ట్రెయిన్, పవర్, గాలి నిరోధాన్ని తగ్గించే ఏరోడైనమిక్స్‌లో కీలక మార్పులు చేశారు. దీంతో రేసింగ్ జట్లు కొత్త కారు పనితీరుకు అనుగుణంగా బ్యాటరీ వినియోగం, వేగం, రేసు వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

1.8 సెకన్లలోనే 100 kmph వేగం

ఈ కారు పనితీరు చూస్తేనే దాని వేగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. M13Electro గరిష్ఠంగా 804 bhp పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. గంటకు 335 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. కేవలం 1.8 సెకన్లలోనే 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వ్యవస్థతో పాటు అధునాతన బ్రేకింగ్ టెక్నాలజీ ఉంది. వేగంగా దూసుకెళ్లే సమయంలోనూ కారుపై నియంత్రణ సాధించేందుకు ఇవి ఉపయోగపడతాయి.

పర్యావరణానికి అనుకూలంగా తయారీ

వేగం మాత్రమే కాదు.. పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ కారులో ప్రాధాన్యం ఇచ్చారు. ఫార్ములా ఈ జెన్-4 కారును అత్యంత సుస్థిరమైన రేసింగ్ కారుగా అభివర్ణిస్తోంది. ఇందులో ఉపయోగించిన భాగాలను తిరిగి రీసైకిల్ చేసేలా రూపొందించారు. కారు తయారీలో 20 శాతానికి పైగా రీసైకిల్ చేసిన పదార్థాలను ఉపయోగించారు. రేసింగ్‌లో అధునాతన సాంకేతికతతో పాటు పర్యావరణానికి మేలు చేసే విధానాలను ప్రోత్సహించడమే దీని లక్ష్యం.

అదే డ్రైవర్లతో బరిలోకి మహీంద్రా

2027 సీజన్‌లో మహీంద్రా రేసింగ్ తరఫున నిక్ డి వ్రీస్, ఎడోఆర్డో మోర్టారా కొనసాగనున్నారు. వీరిద్దరూ వరుసగా నాలుగో సీజన్‌లో జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. కొత్త కారును పూర్తిగా అర్థం చేసుకుని దాని సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని మహీంద్రా రేసింగ్ సీఈఓ, టీమ్ ప్రిన్సిపల్ ఫ్రెడరిక్ బెర్ట్రాండ్ తెలిపారు. కాగా, ఏబీబీ ఎఫ్‌ఐఏ ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న ఏకైక భారతీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా కావడం విశేషం.

Next Story