Mahindra : హైబ్రిడ్ మార్కెట్లోకి మహీంద్రా గ్రాండ్ ఎంట్రీ.. సరికొత్త ఇంజిన్‌తో వస్తున్న ఎక్స్‌యూవీ 7XO
సరికొత్త ఇంజిన్‌తో వస్తున్న ఎక్స్‌యూవీ 7XO

Mahindra : భారత ఎస్‌యూవీ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా. ఇప్పటివరకు పవర్‌ఫుల్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్లతో దూసుకుపోయిన మహీంద్రా.. ఇప్పుడు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న హైబ్రిడ్ వాహనాల సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే సరికొత్త డిజైన్, అప్‌డేటెడ్ ఫీచర్లు, అద్భుతమైన సస్పెన్షన్‌తో తన బెస్ట్ సెల్లింగ్ మోడల్ XUV 7XOను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాపులర్ మోడల్‌ను మరింత పవర్‌ఫుల్‌గా, ఎక్కువ మైలేజ్ ఇచ్చేలా హైబ్రిడ్ అవతారంలో తీసుకురావడానికి కంపెనీ వేగంగా అడుగులు వేస్తోంది.
రెండు క్రేజీ ప్రాజెక్టులు.. సీక్రెట్ కోడ్‌నేమ్స్ లీక్
మీడియా వర్గాల నుంచి లీకైన సమాచారం ప్రకారం.. మహీంద్రా సంస్థ ప్రస్తుతం అంతర్గతంగా రెండు పెద్ద హైబ్రిడ్ ప్రాజెక్టులపై పని చేస్తోంది. వీటికి W613, W623 అనే సీక్రెట్ కోడ్‌నేమ్స్ కూడా పెట్టింది. ఇందులో W613 అనే ప్రాజెక్ట్ మహీంద్రా కంపెనీకి చెందిన మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ XUV 7XO హైబ్రిడ్ వెర్షన్‌కు సంబంధించింది. ఈ మోడల్‌ను 2027 నాటికి భారత మార్కెట్లో లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. అలాగే రెండో ప్రాజెక్ట్ అయిన W623.. రాబోయే XEV 9e కారు రేంజ్-ఎక్స్‌టెండర్ హైబ్రిడ్ వెర్షన్‌కు సంబంధించింది. ఇది 2028లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల సాంప్రదాయ ఐసీఈ ఇంజిన్లతో పాటు సరికొత్త INGLO ఈవీ ప్లాట్‌ఫామ్‌పై కూడా మహీంద్రా హైబ్రిడ్ టెక్నాలజీని తీసుకురాబోతోందని స్పష్టమవుతోంది.
మోనోకోక్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త సిస్టమ్
ప్రస్తుతానికి ఈ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌కు సంబంధించిన పూర్తి టెక్నికల్ వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే, రాబోయే మహీంద్రా XUV 7XO హైబ్రిడ్ మోడల్ అధునాతన మోనోకోక్ ప్లాట్‌ఫామ్ పై బేస్ అయి ఉంటుందని ఆటో నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మార్కెట్లో ఇప్పటికే సక్సెస్ అయిన మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కార్లలో చూసినట్లుగానే.. ఇందులో కూడా సిరీస్-ప్యారలల్ హైబ్రిడ్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. ఈ సరికొత్త ఎస్‌యూవీలో ఒక ఎఫిషియంట్ పెట్రోల్ ఇంజిన్, పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్, సెల్ఫ్-ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన బ్యాటరీ ప్యాక్ ఉండబోతున్నాయి.
అసలు సిరీస్-ప్యారలల్ హైబ్రిడ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే?
ఈ అధునాతన సిరీస్-ప్యారలల్ హైబ్రిడ్ టెక్నాలజీ కారు నడిచే వేగాన్ని బట్టి ఆటోమాటిక్‌గా మోడ్స్ మారుస్తుంది. ఉదాహరణకు కారు తక్కువ స్పీడ్‌తో వెళ్తున్నప్పుడు అది పూర్తిగా ఈవీ మోడ్‌లో నడుస్తుంది. అంటే బ్యాటరీ ద్వారా ఎలక్ట్రిక్ మోటార్ రన్ అవుతూ చక్రాలను తిప్పుతుంది, ఆ సమయంలో పెట్రోల్ ఇంజిన్ పూర్తిగా బంద్ అయి ఉంటుంది. ఒకవేళ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గినప్పుడు పెట్రోల్ ఇంజిన్ ఆటోమాటిక్‌గా స్టార్ట్ అయి జనరేటర్ సహాయంతో విద్యుత్‌ను తయారు చేసి మోటార్‌కు అందిస్తుంది లేదా బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఇక కారు ఎక్కువ స్పీడ్‌తో వెళ్తున్నప్పుడు పెట్రోల్ ఇంజిన్ నేరుగా చక్రాలను నడుపుతుంది, అవసరమైనప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ కూడా దానికి అదనపు పవర్‌ను అందిస్తుంది.
బ్రేక్ వేస్తే ఛార్జ్ అయ్యే అద్భుత సాంకేతికత
ఈ సిస్టమ్‌లో ఉండే మరో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. డ్రైవర్ కారుకు బ్రేక్ వేసినప్పుడు లేదా యాక్సిలేటర్ నుంచి కాలు తీసేసినప్పుడు చక్రాల వేగం వల్ల వచ్చే గతి శక్తిని ఎలక్ట్రిక్ మోటార్ గ్రహించి విద్యుత్‌గా మారుస్తుంది. ఈ కరెంట్‌తో కారులోని బ్యాటరీ ప్యాక్ దానంతట అదే మళ్లీ రీఛార్జ్ అవుతుంది. అంటే మనం విడిగా కారును ప్లగ్ పెట్టి ఛార్జ్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఈ అద్భుతమైన టెక్నాలజీ వల్ల మహీంద్రా XUV 7XO మైలేజ్ ఊహించని రేంజ్‌లో పెరుగుతుంది. లగ్జరీ ఫీచర్లు, పవర్‌ఫుల్ బాడీతో పాటు అదిరిపోయే మైలేజ్ కూడా తోడైతే రాబోయే రోజుల్లో మహీంద్రాకు తిరుగుండదని ఆటోమొబైల్ వర్గాలు అంటున్నాయి.

