Mahindra: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చే కార్లకు యువత ఫిదా అవుతుంటారు. తాజాగా కంపెనీ అత్యంత ప్రజాదరణ పొందిన స్కార్పియో బ్రాండ్‌లో ఒక సరికొత్త సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. విజన్ ఎస్ కాన్సెప్ట్ ఆధారంగా తయారవుతున్న ఈ కొత్త ఎస్‌యూవీకి సంబంధించిన టెస్టింగ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. కంపెనీకి చెందిన సరికొత్త NU_IQ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై ఈ కారును అభివృద్ధి చేస్తున్నారు.

రఫ్ అండ్ టఫ్ ఎక్స్‌టీరియర్ డిజైన్

ఈ మినీ స్కార్పియో డిజైన్ విషయానికి వస్తే.. ఇది చూడటానికి సరిగ్గా పెద్ద స్కార్పియో క్లాసిక్, స్కార్పియో-ఎన్ మాదిరిగానే చాలా మస్క్యులర్, బాక్సీ లుక్‌లో కనిపిస్తుంది. కారు ముందు భాగంలో ఆకర్షణీయమైన గ్రిల్, చతురస్రాకారపు వీల్ ఆర్చులు, ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్, పెద్ద 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. వెనుక వైపు ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్ క్లస్టర్, సైడ్-హింజ్డ్ రియర్ డోర్, టెయిల్‌గేట్‌పై ఫుల్-సైజ్ స్పేర్ వీల్ ఇచ్చారు. మోడర్న్ ప్లాట్‌ఫారమ్‌పై తయారైనప్పటికీ, ఇది ల్యాడర్-ఫ్రేమ్ చాసిస్ తరహా గట్టిదనాన్ని ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

అధునాతన ఇంటీరియర్, లగ్జరీ ఫీచర్లు

ఈ కారు లోపలి క్యాబిన్ డిజైన్ అత్యంత ఆధునిక హంగులతో రూపొందించబడింది. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం విడివిడిగా రెండు 10.25-అంగుళాల పెద్ద స్క్రీన్‌లను అందించారు. సెంట్రల్ కన్సోల్ వద్ద ఎయిర్‌క్రాఫ్ట్-స్టైల్ టాగుల్ స్విచ్‌లు, ఫిజికల్ క్లైమేట్ కంట్రోల్ డయల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఆటో-హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెదరెట్ స్టీరింగ్ వీల్ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో లభించనున్నాయి. భద్రత కోసం లెవెల్-2 ఏడీఏఎస్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

పవర్ఫుల్ ఇంజిన్, మార్కెట్ విడుదల

ఇంజిన్ పరంగా చూస్తే.. ఈ మినీ స్కార్పియోలో 1.2-లీటర్ ఎంస్టాలియన్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు లభించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇందులో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ టెక్నాలజీని కూడా పరిచయం చేసేలా మహీంద్రా ప్రణాళికలు రచిస్తోంది. మార్కెట్‌లో ఇది ఇప్పటికే ఉన్న మహీంద్రా XUV 3XOతో పాటు నిలవనుంది. ప్రధానంగా టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ కార్లకు ఇది గట్టి పోటీ ఇస్తుంది. వచ్చే ఏడాది (2027) ప్రారంభంలో జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ కారు అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Next Story