Mahindra Vision S : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ విభాగంలో తిరుగులేని పాపులారిటీ ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ.. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మరో సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీపై కసరత్తులు చేస్తోంది. కార్ల మార్కెట్లో మిని స్కార్పియోగా పిలవబడుతున్న మహీంద్రా విజన్ ఎస్ అనే మోడల్‌ను కంపెనీ త్వరలోనే ప్రొడక్షన్ దశకు తీసుకురాబోతోంది. రోడ్లపై టెస్టింగ్ చేస్తున్న సమయంలో ఈ కారును పలుమార్లు గుర్తించారు. దీని ఎత్తైన బోనట్, పవర్‌ఫుల్ ఫ్రంట్ లుక్ చూస్తుంటే విదేశీ లగ్జరీ కార్లయిన ఫోర్డ్ బ్రోంకో, ల్యాండ్ రోవర్ డిఫెండర్ మోడల్స్ గుర్తుకు రావడం ఖాయం.

రాబోయే మహీంద్రా విజన్ ఎస్ కారులో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. దీనిని కంపెనీ పూర్తి సరికొత్త NU_IQ ఆర్కిటెక్చర్ పై నిర్మిస్తోంది. నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ ప్లాట్‌ఫారమ్ వల్ల ఒకే కారును రకరకాల ఇంజన్ ఆప్షన్లతో తయారు చేసే వీలుంటుంది. అంటే ఈ ఒక్క కారునే కంపెనీ సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ మోడల్స్‌తో పాటు పర్యావరణ హితమైన పూర్తి ఎలక్ట్రిక్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్ వెర్షన్లలో కూడా మార్కెట్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. దీనివల్ల కస్టమర్లకు తమకు నచ్చిన ఇంధన ఆప్షన్‌ను ఎంచుకునే అద్భుతమైన వెసులుబాటు లభిస్తుంది.

టెస్టింగ్ లీక్స్ ప్రకారం.. ఈ సరికొత్త ఎస్‌యూవీ సైడ్ ప్రొఫైల్ చూడ్డానికి చాలా అగ్రెసివ్‌గా, బల్కీగా ఉంది. ఇందులో 5-స్పోక్ డిజైన్ కలిగిన స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించారు. కారు డోర్ల చుట్టూ, వీల్ ఆర్చెస్ వద్ద గరుకైన, బలమైన సైడ్ క్లాడింగ్‌ను ఇచ్చారు. ఇది కారుకు పక్కా రగ్గడ్ ఆఫ్-రోడర్ లుక్‌ను తీసుకువస్తుంది. దీనితో పాటు ఫ్యూచరిస్టిక్ కార్లలో ఇచ్చే విధంగా డోర్ లోపలికి కలిసిపోయే ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్ కూడా ఈ కారులో హైలైట్‌గా నిలవనున్నాయి.

కారు ఇంటీరియర్ విషయానికి వస్తే మహీంద్రా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని తెలుస్తోంది. డ్యాష్‌బోర్డ్ పై డబుల్ ట్రాపెజోయిడల్ ఏసీ వెంట్స్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఒక భారీ 12.3-ఇంచుల టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను అమర్చారు. అలాగే స్కార్పియో-ఎన్ కారు తరహాలోనే మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే కలిగిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇందులో ఇస్తున్నారు. వీటితో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సనరూఫ్, మాన్యువల్ హ్యాండ్‌బ్రేక్ వంటి ఎన్నో ఆధునిక, సౌకర్యవంతమైన ఫీచర్లను ఈ కారు కేబిన్ లోపల జత చేయనున్నారు.

మహీంద్రా విజన్ ఎస్ లాంచ్ తేదీపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ఆటోమొబైల్ వర్గాల అంచనా ప్రకారం ఈ కారును 2026 చివరి నాటికి గ్లోబల్‌గా అన్‌వీల్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 2027 ప్రారంభంలో దీనిని భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయవచ్చు. ఇక ధర విషయానికి వస్తే.. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మన దేశంలో దాదాపు రూ. 10 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) బడ్జెట్ పరిధిలో లభించే అవకాశం ఉంది. ఈ ధరలో వస్తే మాత్రం మార్కెట్లో ఉన్న మిగతా మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఎదురవడం ఖాయం.

PolitEnt Media

PolitEnt Media

Next Story