ఎస్‌యూవీ సామ్రాజ్యంలో స్కార్పియోనే ఇక రారాజు

Mahindra Scorpio : భారత ఆటోమొబైల్ రంగంలో ఇన్నాళ్లూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన హ్యుందాయ్ క్రెటాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో రారాజుగా వెలిగిన క్రెటాను, మన దేశీ బ్రాండ్ మహీంద్రా స్కార్పియో వెనక్కి నెట్టేసింది. 2025 డిసెంబర్ నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే..మహీంద్రా స్కార్పియో ఏకంగా 15,885 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది డిసెంబర్ తో పోలిస్తే ఇది సుమారు 30 శాతం వృద్ధిని కనబరచడం విశేషం.

నిజానికి హ్యుందాయ్ క్రెటాకు 2025 ఏడాది మొత్తం మీద అద్భుతమైన అమ్మకాలు వచ్చాయి. ఏడాది పొడవునా సుమారు 2 లక్షల యూనిట్లు అమ్ముడై తన విభాగంలో బలమైన ముద్ర వేసింది. అయితే ఏడాది ఆఖరి నెలలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. డిసెంబర్ లో క్రెటా కేవలం 13,154 యూనిట్లకే పరిమితమై రెండో స్థానానికి పడిపోయింది. స్కార్పియో ఎన్ కు వచ్చిన అద్భుతమైన స్పందనతో పాటు, పాత స్కార్పియో క్లాసిక్ వెర్షన్ సప్లై నిరంతరంగా కొనసాగడం మహీంద్రాకు కలిసి వచ్చింది.

2002లో తొలిసారి విడుదలైనప్పటి నుంచి స్కార్పియో భారతీయ కస్టమర్ల మనసు గెలుచుకుంటూనే ఉంది. దీని దృఢమైన బాడీ, ఏ రకమైన రోడ్డునైనా తట్టుకోగల సామర్థ్యం, పవర్‌ఫుల్ డీజిల్ ఇంజిన్ దీనిని ఒక లెజెండరీ కారుగా మార్చాయి. సిటీ రోడ్లపై రాజసం చూపిస్తూనే.. పల్లెటూరి మట్టి రోడ్లపై కూడా దూసుకుపోవడం దీని ప్రత్యేకత. అందుకే లైఫ్ స్టైల్ ఎస్‌యూవీ కోరుకునే వారు ఇప్పటికీ స్కార్పియోకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రస్తుతం మహీంద్రా రెండు రకాల స్కార్పియోలను విక్రయిస్తోంది.

స్కార్పియో క్లాసిక్: దీని ధర రూ. 12.98 లక్షల నుంచి మొదలై రూ. 16.71 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

స్కార్పియో ఎన్ : ఇది మరిన్ని ఫీచర్లతో వస్తుంది. దీని బేస్ మోడల్ రూ.13.20 లక్షల నుంచి టాప్ ఎండ్ 4x4 వేరియంట్ రూ.24.17 లక్షల వరకు లభిస్తోంది. సరసమైన ధరలో పవర్ఫుల్ ఎస్‌యూవీ కావాలనుకునే వారికి క్లాసిక్ వెర్షన్, లగ్జరీ ఫీచర్లు కోరుకునే వారికి ఎన్ వెర్షన్ అందుబాటులో ఉండటంతో మహీంద్రా అమ్మకాల్లో దూసుకుపోతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story