Mahindra Scorpio N : టాటా సఫారీకి సరికొత్త సవాల్..మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది
మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది

Mahindra Scorpio N : భారతీయ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటైన మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఈ కొత్త మోడల్‌ను ప్రస్తుతం ఉన్న స్కార్పియో క్లాసిక్తో పాటు విక్రయించే అవకాశం ఉంది. మహీంద్రా XUV700 అప్‌డేట్ వెర్షన్ విడుదలైన తర్వాత ఈ స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ 2026లో మార్కెట్‌లోకి రావచ్చని అంచనా. ఈ అప్‌డేట్‌లో పవర్ట్రైన్ ఆప్షన్లను అలాగే ఉంచుతూ, డిజైన్‌లో చిన్న మార్పులు, ఇంటీరియర్‌లో అత్యాధునిక ఫీచర్లను జోడించనున్నారు.
డిజైన్‌లో మార్పులు, లుక్ అప్‌గ్రేడ్
మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ మోడల్ స్పై చిత్రాలను పరిశీలిస్తే.. ముందు భాగంలో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఈ SUVకి కొత్త డిజైన్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్, కొత్త LED DRLలు (డేటైమ్ రన్నింగ్ లైట్లు), ముందు, వెనుక భాగంలో అప్‌డేట్ అయిన బంపర్‌లు లభించే అవకాశం ఉంది. ఈ కారు మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి, అల్లాయ్ వీల్స్‌కు కొత్త లుక్‌ను ఇవ్వడంతో పాటు, వాటి సైజును 19-అంగుళాల వరకు పెంచే అవకాశం కూడా ఉంది. ఈ మార్పులన్నీ SUV కి మరింత పటిష్టమైన, ఆధునిక రూపాన్నిస్తాయి.
క్యాబిన్‌లో భారీ ఫీచర్ల అప్‌గ్రేడ్
స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్లో అనేక ముఖ్యమైన ఫీచర్ల అప్‌గ్రేడ్‌లు ఉంటాయి. ఈ SUVకి పానరోమిక్ సన్‌రూఫ్ లభించే అవకాశం ఉంది. ఇది కారుకు ప్రీమియం లుక్‌ను పెంచుతుంది. డ్రైవర్ కోసం పూర్తిగా డిజిటల్ TFT డ్రైవర్ డిస్‌ప్లే, అలాగే పెద్దదైన 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉండవచ్చు. సౌకర్యాన్ని పెంచేందుకు, ముందు, వెనుక భాగంలో వెంటిలేటెడ్ సీట్లు, డ్రైవర్ సీటు కోసం మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ సీట్లు వంటివి జోడించబడతాయి. అంతేకాకుండా మెరుగైన ఆడియో అనుభవం కోసం డాల్బీ అట్మోస్‌తో కూడిన హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్‌ను, ఆటో-పార్క్ ఫంక్షన్‌ను కూడా తీసుకురావచ్చు.
ఇంజిన్ పర్ఫామెన్స్ వివరాలు
మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుతం ఉన్న పవర్ఫుల్ ఇంజిన్ ఆప్షన్లే కొనసాగే అవకాశం ఉంది. అవి: 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్. ఈ రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ (MT) లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ (AT) గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి. అయితే, మరింత మెరుగైన పర్ఫామెన్స్ , మైలేజ్ కోసం ఇంజిన్లలో స్వల్ప మెరుగుదలలు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ అప్‌డేట్‌తో మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ మార్కెట్‌లో టాటా సఫారీ వంటి ప్రత్యర్థులతో గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

