మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ లీక్

Mahindra Scorpio N : మహీంద్రా తన ఎస్‌యూవీల పోర్ట్‌ఫోలియోను నిరంతరం అప్‌డేట్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఎక్స్‌యూవీ 7XO, థార్ రాక్స్ వంటి విజయవంతమైన మోడల్స్ తర్వాత, ఇప్పుడు అందరి దృష్టి స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ పై పడింది. లీక్ అయిన స్పై చిత్రాల ప్రకారం, ఈ కొత్త వెర్షన్ ఎక్స్‌టీరియర్ కంటే ఇంటీరియర్‌లో విప్లవాత్మక మార్పులతో రాబోతోంది.

స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌లో కనిపించే అతిపెద్ద మార్పు దాని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ప్రస్తుత మోడల్‌లో ఉన్న 8-ఇంచ్ స్క్రీన్ స్థానంలో, థార్ రాక్స్ తరహాలో 12.3-ఇంచ్ ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ రాబోతోంది. ఇది చూడటానికి చాలా ప్రీమియంగా ఉండటమే కాకుండా, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు పాత అనలాగ్ మీటర్ల స్థానంలో 10.25-ఇంచ్ ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉండబోతోంది. డ్యాష్‌బోర్డ్‌లో సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ వాడకం వల్ల లోపల లగ్జరీ ఫీల్ పెరుగుతుంది.

బయట వైపు చూస్తే.. కారు పటిష్టమైన బాడీ షేప్‌లో ఎలాంటి మార్పులు లేవు. అయితే కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు డే-టైమ్ రన్నింగ్ లైట్స్ రానున్నాయి. 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌కు సరికొత్త డిజైన్ ఇచ్చారు. అంతేకాకుండా, వినియోగదారుల కోరిక మేరకు ఈసారి టాప్ వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్ ఇచ్చే అవకాశం మెండుగా ఉంది.

మహీంద్రా ఇప్పుడు సేఫ్టీకి పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగానే స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌లో లెవల్-2 ఏడీఏఎస్ టెక్నాలజీని తీసుకురానున్నారు. దీనివల్ల అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి సదుపాయాలు లభిస్తాయి. 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు మరియు హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు కారు విలువను మరింత పెంచుతాయి.

మెకానికల్‌గా కారులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇప్పటికే పవర్‌ఫుల్‌గా ఉన్న 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌లనే మహీంద్రా కొనసాగించనుంది. ఇవి 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తాయి. రఫ్ రోడ్లపై దూసుకుపోవడానికి అవసరమైన 4-వీల్ డ్రైవ్ ఆప్షన్ యథావిధిగా అందుబాటులో ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story