ఒక్క నెలలోనే లక్ష బండ్లు క్లీన్ స్వీప్, ప్రత్యర్థుల అడ్రస్ గల్లంతు

Mahindra : భారతీయ రోడ్లపై మహీంద్రా ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. మార్చి 2026 నెలకు సంబంధించిన విక్రయాల గణాంకాల్లో మహీంద్రా సరికొత్త రికార్డులను సృష్టించింది. కేవలం ఎస్‌యూవీ విభాగంలోనే కాకుండా, కమర్షియల్ వాహనాల్లో కూడా కంపెనీ తిరుగులేని వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు భారీగా పెరగడంతో, మహీంద్రా తన మార్కెట్ వాటాను మరింత పటిష్టం చేసుకుంది. ముఖ్యంగా థార్, స్కార్పియో, ఎక్స్‌యూవీ 700 వంటి మోడళ్లకు ఉన్న క్రేజ్ ఈ స్థాయి విజయానికి కారణమైందని ఆటోమొబైల్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఎస్‌యూవీ విభాగంలో రికార్డుల పంట

మహీంద్రా కంపెనీకి మార్చి 2026 ఒక చిరస్మరణీయమైన నెలగా నిలిచిపోయింది. దేశీయ మార్కెట్లో కేవలం ఎస్‌యూవీల అమ్మకాలే 60,272 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది మార్చిలో ఈ సంఖ్య 48,048 యూనిట్లుగా ఉండేది, అంటే ఏకంగా 25 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. ఇక ఎగుమతులతో కలిపి చూస్తే మొత్తం 62,109 ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. కస్టమర్లు ఇప్పుడు పెద్ద వాహనాలు, అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్న ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతుండటమే మహీంద్రాకు కలిసొచ్చింది.

ఆటో డివిజన్ మొత్తం జోరు

కేవలం ఎస్‌యూవీలే కాకుండా కమర్షియల్ వాహనాలు, త్రీ వీలర్ వెహికల్స్ ఎగుమతులన్నీ కలిపి చూస్తే మహీంద్రా విక్రయాలు 99,969 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది గతేడాది కంటే 21 శాతం ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే లక్ష వాహనాల మార్కును దాటడానికి మహీంద్రా కేవలం కొన్ని అడుగుల దూరంలోనే నిలిచింది. కమర్షియల్ వాహనాల విభాగంలో (LCV 3.5 టన్నుల వరకు) 13 శాతం వృద్ధి కనిపించింది. త్రీ వీలర్ వెహికల్స్ అమ్మకాలు ఏకంగా 39 శాతం పెరిగి 10,801 యూనిట్లకు చేరడం విశేషం.

ఆర్థిక సంవత్సరం 2026

మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని (FY26) పరిగణనలోకి తీసుకుంటే, మహీంద్రా ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 6,60,276 ఎస్‌యూవీలను విక్రయించింది. ఇది అంతకుముందు ఏడాది అమ్మిన 5,51,487 యూనిట్ల కంటే 20 శాతం ఎక్కువ. ఎగుమతులు కూడా ఏడాది పొడవునా 18 శాతం పెరిగి 40,990 యూనిట్లకు చేరుకున్నాయి. కంపెనీ ఆటో విభాగం సీఈవో నలినికాంత్ గొల్లాగుంటా మాట్లాడుతూ.. ఈ ఏడాది తమకు అన్ని విధాలా కలిసి వచ్చిందని, ఎస్‌యూవీ మరియు ఎల్‌సీవీ విభాగాల్లో లైఫ్-టైమ్ బెస్ట్ అమ్మకాలను చూశామని సంతోషం వ్యక్తం చేశారు.

భవిష్యత్ ప్రణాళికలు.. ఎస్‌యూవీలపైనే ఫోకస్

మహీంద్రా వ్యూహం ఇప్పుడు పూర్తిగా ఎస్‌యూవీల చుట్టూనే తిరుగుతోంది. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మరింత శక్తివంతమైన, టెక్నాలజీతో కూడిన వాహనాలను మార్కెట్లోకి తెచ్చే పనిలో ఉంది. కమర్షియల్ వాహనాల్లో కూడా తన పట్టును కాపాడుకుంటూనే, ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో నంబర్ వన్ స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఉన్న డిమాండ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో కూడా మహీంద్రా విక్రయాల జోరు ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story