Mahindra SUVs: కారు కొనేవారికి షాకిచ్చిన మహీంద్రా.. థార్, స్కార్పియో ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్
మళ్లీ పెరిగే ఛాన్స్

Mahindra SUVs: ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల కొనుగోలుదారులకు త్వరలోనే ధరల పెరుగుదల రూపంలో షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. కంపెనీ తన పాపులర్ ఎస్‌యూవీలైన థార్, స్కార్పియో అలాగే XUV 7XO ధరలను మరోసారి పెంచాలని ఆలోచిస్తోంది. రాబోయే కొన్ని వారాల్లోనే ఈ ధరల పెంపుపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కచ్చితంగా ధరలు పెరిగితే కస్టమర్లు తమ డ్రీమ్ కార్ల కోసం గతంతో పోలిస్తే మరింత ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
ఇప్పటికే మూడుసార్లు పెరిగిన ధరలు
ముడిసరుకు లేదా కమోడిటీ ధరలు విపరీతంగా పెరుగుతుండటమే ఈ రేట్ల పెంపునకు ప్రధాన కారణమని మహీంద్రా ఆటోమోటివ్ ప్రెసిడెంట్, సీఈఓ నళినీకాంత్ గొల్లగుంట తెలిపారు. కాగా ఈ ఏడాదిలో ఇప్పటికే జనవరి, ఏప్రిల్, జూలై నెలల్లో మూడుసార్లు ధరలను పెంచిన సంగతి తెలిసిందే. జూలై నెలలో ముడిసరుకు భారాన్ని తట్టుకోవడానికి సగటున 2.7 శాతం వరకు రేట్లు పెంచారు. ఇప్పుడు మళ్లీ అదే కారణంతో మరోసారి ధరలను సమీక్షించాలని కంపెనీ భావిస్తోంది.
ధరలు పెరిగినా తగ్గని డిమాండ్
గతంలో పలుమార్లు కార్ల ధరలు పెరిగినప్పటికీ, షోరూమ్‌లలో విచారణలు లేదా బుకింగ్‌లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని కంపెనీ స్పష్టం చేసింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల కార్ల ధరలు పాత జీఎస్టీ స్థాయిల కంటే తక్కువగానే ఉండటంతో మార్కెట్లో డిమాండ్ ఇప్పటికీ చాలా బలంగా ఉంది. రాబోయే పండుగ సీజన్ లో అమ్మకాలు మరింత ఊపందుకుంటాయని మహీంద్రా ధీమాగా ఉంది. కొత్త అప్‌డేటెడ్ మోడల్స్ కస్టమర్లను ఆకట్టుకుంటుండటంతో అమ్మకాల జోరు కొనసాగుతోంది.
ఎలక్ట్రిక్ వాహనాలపైనే పూర్తి ఫోకస్
మార్కెట్లో హైబ్రిడ్ కార్ల ట్రెండ్ నడుస్తున్నప్పటికీ, మహీంద్రా మాత్రం తన వ్యూహాన్ని స్పష్టంగా ఉంచింది. కంపెనీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీపైనే తన దృష్టిని పూర్తిగా కేంద్రీకరించింది. భారత ఆటోమొబైల్ భవిష్యత్తు ఎలక్ట్రిక్ రంగం వైపే వెళ్తుందని కంపెనీ గట్టిగా నమ్ముతోంది. అయితే ప్రభుత్వ నిబంధనలలో భవిష్యత్తులో ఏవైనా మార్పులు వస్తే, అందుకు తగినట్లుగా తన ప్లాన్‌లను మార్చుకునే వెసులుబాటును కూడా కంపెనీ సిద్ధం చేసుకుంది.
పెరగనున్న ప్రొడక్షన్ కెపాసిటీ
పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచాలని మహీంద్రా నిర్ణయించింది. ప్రస్తుతం నెలకు సుమారు 60,000 పెట్రోల్-డీజిల్ కార్లు, 8,000 ఈవీ కార్లను తయారు చేస్తుండగా, రాబోయే మార్చి లేదా ఏప్రిల్ నాటికి ఈ సంఖ్యను మరింత పెంచనున్నారు. పెట్రోల్-డీజిల్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని 70,000 యూనిట్లకు, ఈవీ సామర్థ్యాన్ని 12,000 యూనిట్లకు పెంచనున్నారు. తద్వారా మొత్తం ప్రొడక్షన్ కెపాసిటీ నెలకు 84,000 యూనిట్లకు చేరుకుంటుంది. వచ్చే రెండు త్రైమాసికాల్లో ఒక కొత్త పెట్రోల్-డీజిల్ మోడల్, మరొక ఎలక్ట్రిక్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

