Mahindra Thar : పెరిగిన మహీంద్రా థార్ ధరలు..ఏ మోడల్‌పై ఎంత పెరిగిందో తెలుసా?
ఏ మోడల్‌పై ఎంత పెరిగిందో తెలుసా?

Mahindra Thar : ఆఫ్-రోడ్ ప్రేమికుల కలల వాహనం మహీంద్రా థార్ ధరలకు రెక్కలొచ్చాయి. కొత్త ఏడాదిలో తన కస్టమర్లకు మహీంద్రా కంపెనీ గట్టి షాకే ఇచ్చింది. బేస్ మోడల్ మినహా మిగిలిన అన్ని వేరియంట్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మహీంద్రా సంస్థ తన పాపులర్ ఎస్‌యూవీ థార్ 2026 మోడల్ ధరలను రూ.20,000 వరకు పెంచింది. జనవరి 17, 2026 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.
థార్ బేస్ మోడల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇది ఇప్పటికీ రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ధరల పెంపు తర్వాత థార్ టాప్ మోడల్ ధర రూ.17.19 లక్షలకు చేరుకుంది. 1.5 లీటర్ డీజిల్-మాన్యువల్ LXT 2WD వేరియంట్‌పై అత్యధికంగా 1.64 శాతం ధర పెరిగింది. దాదాపు అన్ని మిడ్, టాప్ వేరియంట్లపై రూ.20 వేల భారం పడింది.
గతేడాది అక్టోబర్‌లో లాంచ్ చేసిన థార్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కొన్ని ఆసక్తికరమైన మార్పులు చేశారు. ముఖ్యంగా ఐదు డోర్స్ థార్ రాక్స్ నుంచి కొన్ని డిజైన్ ఎలిమెంట్స్‌ను దీనికి అద్దారు. మునుపటి నలుపు రంగు గ్రిల్ స్థానంలో ఇప్పుడు బాడీ కలర్ ఫినిషింగ్ ఉన్న కొత్త గ్రిల్ ఇచ్చారు. డ్యూయల్-టోన్ బంపర్‌తో కారు ముఖ భాగం మరింత గంభీరంగా మారింది. బ్యాటిల్ షిప్ గ్రే, టాంగో రెడ్ వంటి కొత్త కలర్ ఆప్షన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 18-అంగుళాల డీప్ సిల్వర్ అల్లాయ్ వీల్స్ కారుకు మంచి ఆఫ్-రోడ్ స్టాన్స్‌ను ఇస్తున్నాయి.
ధర పెరిగినా, దానికి తగ్గట్టుగానే ఫీచర్లను కూడా అప్‌డేట్ చేసింది మహీంద్రా. కేబిన్ లోపల ఇప్పుడు పెద్ద 10.25-అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. మొదటిసారిగా థార్ 3-డోర్ వెర్షన్‌లో రియర్ ఏసీ వెంట్స్, స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్ ఇచ్చారు. స్టీరింగ్ వీల్ డిజైన్ కూడా మారింది. ఇప్పుడు ఇందులో రియర్ వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, ప్రస్తుతానికి సాఫ్ట్-టాప్ ఆప్షన్‌ను తొలగించి, కేవలం హార్డ్-టాప్ వేరియంట్లను మాత్రమే కంపెనీ ఎక్కువగా ప్రోత్సహిస్తోంది.
ఇంజిన్ సామర్థ్యం
ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. పాత పవర్‌ఫుల్ ఇంజిన్లే కొనసాగుతున్నాయి:
* 1.5L డీజిల్: 117 BHP పవర్, కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (RWD).
* 2.2L డీజిల్: 130 BHP పవర్, మాన్యువల్, ఆటోమేటిక్ (4WD).
* 2.0L పెట్రోల్: 150 BHP పవర్, మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్లు.

