Mahindra Thar : థార్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 2025 మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది
2025 మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది

Mahindra Thar : భారత మార్కెట్‌లో తమ SUV లతో దూసుకుపోతున్న మహీంద్రా అండ్ మహీంద్రా, రాబోయే నెలల్లో అప్‌డేట్ చేసిన థార్ 3-డోర్, బొలెరో నియోను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే, ఈ రెండు మోడల్‌ల అధికారిక లాంచ్ తేదీలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఇటీవల, కొత్త 2025 మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్‌లో కనిపించింది. ఇది థార్ డిజైన్, లోపలి భాగంలో అనేక మార్పులను కలిగి ఉండబోతుందని తెలుస్తోంది.
2025 కొత్త మహీంద్రా థార్‌లో 10 ప్రధాన మార్పులు
మహీంద్రా తన ఐకానిక్ ఆఫ్-రోడింగ్ SUV థార్‌ను మరింత లేటెస్ట్, ప్రీమియంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో రాబోయే 10 పెద్ద మార్పులు ఇవే:
* కొత్త గ్రిల్ డిజైన్ : ముందు భాగంలో డబుల్-స్టాక్డ్ స్లాట్‌లతో కూడిన కొత్త గ్రిల్ కనిపిస్తుంది.
* C- ఆకారపు LED లైటింగ్: హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్‌లో కొత్త C- ఆకారపు LED సిగ్నేచర్ ఉంటుంది.
* కొత్త అల్లాయ్ వీల్స్ : కొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్‌తో SUV లుక్ మరింత మెరుగుపడుతుంది.
* కొత్త త్రీ-స్పోక్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్: పాత హైడ్రాలిక్ యూనిట్‌కు బదులుగా, కొత్త ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వస్తుంది.
* పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్: 7 అంగుళాల స్థానంలో, 10.25-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.
* పవర్ విండో స్విచ్‌లు: పాత సెంటర్ కన్సోల్‌లో ఉన్న పవర్ విండో స్విచ్‌లు డోర్‌పైకి మారుతాయి.
* గ్రాబ్ హ్యాండిల్స్: ఏ-పిల్లర్ల పైన ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండేలా గ్రాబ్ హ్యాండిల్స్ లభిస్తాయి.
* ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ : ముందు సీట్లలో కూర్చునేవారికి సౌకర్యంగా ఉండేందుకు ఆర్మ్‌రెస్ట్ వస్తుంది.
* రివర్స్ పార్కింగ్ కెమెరా: పార్కింగ్ సౌలభ్యం కోసం రివర్స్ పార్కింగ్ కెమెరా లభిస్తుంది.
* వైర్‌లెస్ ఛార్జింగ్: మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేసుకోవడానికి వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంటుంది.
ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ ఫీచర్లు
ఎక్స్‌టీరియర్ : కొత్త మహీంద్రా థార్ 2025 లో సరికొత్త డబుల్-స్టాక్డ్ స్లాట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్, టెయిల్‌ల్యాంప్‌లలో కొత్త C- ఆకారపు LED లు కనిపిస్తాయి. SUV కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. అయితే, టైర్ల సైజులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.
ఇంటీరియర్, ఫీచర్లు : స్పై ఫోటోల ద్వారా తెలిసిన వివరాల ప్రకారం, కొత్త థార్‌లో ప్రస్తుతం ఉన్న హైడ్రాలిక్ పవర్ యూనిట్‌కు బదులుగా కొత్త త్రీ-స్పోక్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ఉంటుంది. థార్ రాక్స్ నుండి తీసుకోబడిన ఫీచర్లలో పెద్ద 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జర్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, డోర్‌లపై పవర్ విండో స్విచ్‌లు, ఏ-పిల్లర్లపై గ్రాబ్ హ్యాండిల్స్ వంటివి ఉన్నాయి. ఈ ఫీచర్లు థార్ క్యాబిన్‌ను మరింత ప్రీమియం అనుభూతిని ఇస్తాయి.
ఇంజిన్, ధర
ఇంజిన్ : కొత్త 2025 మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత ఇంజిన్ ఆప్షన్‌లనే కొనసాగించనుంది. అవేంటంటే: 152 bhp, 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 119 bhp, 1.5-లీటర్ టర్బో డీజిల్, 132 bhp, 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ట్రాన్స్‌మిషన్ కూడా పాత మోడల్‌లో ఉన్న 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ (2.2 లీటర్ డీజిల్ వేరియంట్‌కు మాత్రమే) లభిస్తుంది.
ధర : ఇటీవల GST తగ్గింపు కారణంగా ప్రస్తుత 3-డోర్ థార్ ధరలో రూ.1.35 లక్షల వరకు కోత పడింది. ఇప్పుడు దీని ధర రూ.10.31 లక్షల నుండి రూ.16.60 లక్షల మధ్య ఉంది. అయితే, మరింత ప్రీమియం ఫీచర్లు, స్టైలింగ్ అప్‌గ్రేడ్‌లతో వస్తున్నందున, 2025 థార్ ఫేస్‌లిఫ్ట్ ధరలో స్వల్ప పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త థార్ మార్కెట్‌లోకి వస్తే, ఆఫ్-రోడింగ్ సెగ్మెంట్‌లో పోటీ మరింత పెరగడం ఖాయం.
