ఏకంగా ఎన్ని లక్షలు తగ్గిందో తెలుసా ?

Mahindra Thar Roxx : దీపావళి పండుగకు ముందు మహీంద్రా తమ కస్టమర్లకు భారీ శుభవార్త అందించింది. అత్యంత ప్రజాదరణ పొందిన వారి థార్ రాక్స్ 5-డోర్ ఎస్‌యూవీ ధరను గణనీయంగా తగ్గించింది. ఇటీవల అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.0 కారణంగా, ఈ ధృడమైన ఎస్‌యూవీ ధర రూ.74 వేల నుంచి ఏకంగా రూ.1.33 లక్షల వరకు తగ్గింది. పండుగ సీజన్‌లో వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం మార్కెట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

మహీంద్రా థార్ రాక్స్ అనేది థార్ 3-డోర్ మోడల్‌తో పోలిస్తే ఎక్కువ స్థలం అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇందులో ఆఫ్-రోడింగ్ సామర్థ్యం అలాగే ఉన్నప్పటికీ, కుటుంబంతో లాంగ్ జర్నీలకు, రోజువారీ అవసరాలకు ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది స్టైలిష్ లైఫ్‌స్టైల్, అవసరాలకు చక్కటి కలయికగా నిలుస్తుంది.

సాధారణంగా పన్నులు పెరిగితే ధరలు పెరుగుతాయి, కానీ ఈసారి మాత్రం థార్ రాక్స్ విషయంలో ధరలు తగ్గడం విశేషం. గతంలో థార్ రాక్స్ పై 28% జీఎస్టీ మరియు 20% కాంపెన్సేషన్ సెస్ కలిపి మొత్తం 48% పన్ను ఉండేది. ఇప్పుడు కొత్త జీఎస్టీ స్ట్రక్చర్‌లో ఎస్‌యూవీలపై నేరుగా 40% జీఎస్టీ మాత్రమే విధించారు. కాంపెన్సేషన్ సెస్ను పూర్తిగా తొలగించారు.

ఈ మార్పు కారణంగా పన్ను భారం 8% తగ్గింది (48% నుంచి 40%కి). ఫలితంగా, వినియోగదారులకు కారు ధర తగ్గి, భారీ కోత కనిపించింది. జీఎస్టీ 2.0 తర్వాత, మహీంద్రా థార్ రాక్స్ ఎక్స్-షోరూమ్ ధరలు ఇప్పుడు రూ.12.25 లక్షల నుంచి ప్రారంభమై రూ.22.06 లక్షల వరకు ఉన్నాయి. బేస్ వేరియంట్ అయిన MX1 RWD MT పెట్రోల్ ధర రూ.74 వేలు చౌకగా లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్లపై కస్టమర్‌లు రూ.1.18 లక్షల వరకు లబ్ధి పొందుతున్నారు. అత్యధిక తగ్గింపు AX7L 4WD డీజిల్-ఆటోమేటిక్ వేరియంట్‌పై లభించింది, దీని ధర ఏకంగా రూ.1.33 లక్షలు తగ్గింది.

ధర తగ్గడంతో పాటు, మహీంద్రా కంపెనీ, డీలర్‌షిప్‌లు పండుగ సీజన్ సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్‌లను కూడా అందిస్తున్నాయి. ధర తగ్గడం, ఎక్స్ ట్రా ఆఫర్లు కలవడంతో థార్ రాక్స్ అమ్మకాలు మరింత పెరిగి, కొత్త రికార్డులు సృష్టిస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story