Mahindra Vision S : భారతీయ ఎస్‌యూవీ మార్కెట్లో తిరుగులేని రారాజుగా వెలుగుతున్న మహీంద్రా కంపెనీ తన సరికొత్త సంచలన మోడల్‌ను ప్రొడక్షన్ దశకు తీసుకువచ్చింది. సబ్-4 మీటర్ సెగ్మెంట్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న మహీంద్రా విజన్ ఎస్ కాన్సెప్ట్ ఆధారిత ఎస్‌యూవీ ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచానికి పరిచయం కానుంది. కాగా, 2027 మొదటి ఆరు నెలల కాలంలో ఈ కారును భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ కారు మార్కెట్లోకి వస్తే సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మిగతా బ్రాండ్లకు గట్టి పోటీ ఎదురుకావడం ఖాయంగా కనిపిస్తోంది.

మహింద్ర విజన్ ఎస్ ఎస్‌యూవీని కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సరికొత్త NU_IQ మోడ్యులర్ మోనోకోక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వంటి అన్ని రకాల ఇంజన్ ఆప్షన్లకు అనుగుణంగా మార్చుకోవచ్చు. మీడియా నివేదికల ప్రకారం, ఈ కారు మార్కెట్లోకి వచ్చాక దీనిని మహింద్ర పాపులర్ స్కార్పియో ఫ్యామిలీలో ఒక భాగంగా చేర్చే అవకాశం ఉంది. అందువల్లే ఆటోమొబైల్ వర్గాల్లో దీనిని మినీ స్కార్పియో అని పిలుస్తున్నారు. రాబోయే జనరేషన్ స్కార్పియోను కూడా కాంపాక్ట్, సబ్-కాంపాక్ట్ వెర్షన్లలో అందుబాటులోకి తెచ్చి మరిన్ని సెగ్మెంట్లను ఆక్రమించాలని మహీంద్రా చూస్తోంది.

టెస్టింగ్ సమయంలో రోడ్లపై కనిపించిన ఈ కారు డిజైన్ ఎస్‌యూవీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి స్కార్పియో లాంటి బాక్సీ డిజైన్, ఎత్తైన, బలమైన రూపాన్ని ఇచ్చారు. ఫ్రంట్ లుక్ విషయానికొస్తే.. ఇందులో మహింద్ర థార్ కారును పోలిన రౌండ్ హెడ్‌లైట్లు ఉన్నాయి, అయితే లోపల లైటింగ్ సిగ్నేచర్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీనితో పాటు ట్రిపుల్ వర్టికల్ ఎల్‌ఈడీ సెటప్, మహింద్ర కొత్త ట్విన్ పీక్స్ లోగో, బంపర్ కింది భాగంలో అడాస్ కోసం రాడార్ యూనిట్, పార్కింగ్ సెన్సార్లను అమర్చారు. కారు ఫాగ్ ల్యాంప్స్ కోసం సరికొత్త పిక్సెల్ స్టైల్ డిజైన్‌ను ఉపయోగించారు.

మహింద్ర విజన్ ఎస్ సైడ్ ప్రొఫైల్ చూస్తే కారు చుట్టూ లావుపాటి ప్లాస్టిక్ క్లాడింగ్, డోర్ల కింద బలమైన బాడీ ప్రొటెక్షన్ కనిపిస్తుంది. ఈ చిన్న కారులో ఏకంగా 19-ఇంచుల పెద్ద అలాయ్ వీల్స్‌ను అందించడం విశేషం. ఈ వీల్స్ స్టార్ డిజైన్ పాటర్న్‌తో పాటు, లోపల స్పోర్టీ లుక్ ఇచ్చే రెడ్ బ్రేక్ కాలిపర్స్, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులతో వస్తున్నాయి. ఈ కారులో లగ్జరీ కార్ల తరహాలో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే, కాన్సెప్ట్ మోడల్‌లో చూపించిన రూఫ్ లైట్లు, బోనట్ యాక్సెసరీలు , వెనుక వైపు ఇచ్చే నిచ్చెన లాంటి డిజైన్లను ఒరిజినల్ ప్రొడక్షన్ మోడల్ నుంచి తొలగించవచ్చు.

కారు ఇంటీరియర్ మరియు ఫీచర్ల విషయానికొస్తే.. స్పై షాట్స్ ప్రకారం దీని డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ చాలా సింపుల్‌గా, క్లాసిక్‌గా ఉండబోతోంది. ఇందులో ట్రెడిషనల్ గేర్ లివర్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన చిన్న ఎంఐడీ డిస్‌ప్లే, మ్యాన్యువల్ ఏసీ కంట్రోల్స్ మరియు ఫ్యాబ్రిక్ సీట్లు బేస్ వేరియంట్లలో రానున్నాయి. అయితే దీని టాప్ వేరియంట్లలో మాత్రం కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు, లగ్జరీ ఫీచర్లు ఉంటాయి. ఇంజన్ పరంగా ఇందులో మహీంద్రా XUV 3XO లో వాడే పవర్‌ఫుల్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించబోతున్నారు. అలాగే పెట్రోల్, హైబ్రిడ్ ఇంజన్ల పూర్తి వివరాలు కారు లాంచ్ సమయానికి అధికారికంగా వెల్లడి కానున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story