Mahindra Vision S: కొండ కోనల్లో చక్కర్లు కొడుతున్న మహీంద్రా కారు.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Mahindra Vision S: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీని బేస్ చేసుకుని ప్రముఖ దేశీయ దిగ్గజం మహీంద్రా తన సరికొత్త ఎస్‌యూవీ విజన్ S మోడల్‌ను రోడ్లపై పరీక్షిస్తోంది. తాజాగా ఈ కొత్త కారును హిమాచల్ ప్రదేశ్‌లోని కఠినమైన లోయ ప్రాంతంలో టెస్టింగ్ చేస్తుండగా కెమెరాకు చిక్కింది. గత ఏడాది ఆగస్టు నెలలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించిన ఈ వాహనాన్ని, ఇప్పుడు ప్రొడక్షన్ దశకు తీసుకువచ్చే పనిలో కంపెనీ నిమగ్నమైంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 నాటికి ఈ అద్భుతమైన ఎస్‌యూవీ అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
థార్‌ను తలపించే రగ్గడ్ లుక్
టెస్టింగ్ సమయంలో కనిపించిన విజన్ S మోడల్ పూర్తిగా కవర్ చేయబడి ఉన్నప్పటికీ, దాని బాక్సీ డిజైన్, ఎత్తైన బాడీ స్టాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందు భాగంలో వెడల్పాటి గ్రిల్, వర్టికల్ స్లాట్లు, ఎల్-షేప్ లైట్లు, పెద్ద ఎయిర్ ఇంటేక్ అమర్చారు. సైడ్ ప్రొఫైల్‌లో వెడల్పాటి వీల్ ఆర్చ్‌లు, బాడీ క్లాడింగ్, డోర్ హ్యాండ్ల్స్, సైడ్ స్టెప్స్ ఇచ్చారు. ఇందులో 18 ఇంచుల అల్లాయ్ వీల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వెనుక వైపు టెయిల్‌గేట్‌పై స్పేర్ వీల్, స్ట్రెయిట్ టెయిల్‌గేట్ ఉండటం వల్ల ఇది సరిగ్గా థార్ లాంటి బలమైన ఆఫ్-రోడింగ్ లుక్‌ను ఇస్తోంది.
మోడ్రన్ కేబిన్.. రెండు పెద్ద స్క్రీన్లు
ఈ ఎస్‌యూవీ లోపలి భాగంలో అత్యంత ఆధునికమైన డాష్‌బోర్డ్ డిజైన్ ఇచ్చారు. ఇందులో వినోదం, సమాచారం కోసం రెండు పెద్ద డిస్‌ప్లే స్క్రీన్లను పొందుపరిచారు. ఒకటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కాగా, మరొకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. క్యాబిన్‌కు ప్రత్యేక లుక్ తెచ్చేలా వర్టికల్ ఏసీ వెంట్లు ఇచ్చారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు సులభంగా ఆపరేట్ చేయడానికి కొన్ని ఫిజికల్ బటన్లను కూడా అలాగే ఉంచారు. టెస్ట్ మోడల్‌లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కనిపిచింది.
కొత్త NU_IQ ప్లాట్‌ఫారమ్
ఈ సరికొత్త విజన్ S మోడల్‌ను మహింద్ర సంస్థ పూర్తిగా కొత్తదైన NU_IQ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా అభివృద్ధి చేస్తోంది. వివిధ రకాల ఇంజిన్లకు అనుగుణంగా ఈ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించారు. మార్కెట్లోకి వచ్చే వెర్షన్‌లో పెట్రోల్ అలాగే డీజిల్ ఇంజిన్ల ఆప్షన్లు లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ వెర్షన్లను కూడా తీసుకువచ్చే అంశంపై కంపెనీ పరిశీలిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

