ఇది రోడ్ల మీద తిరిగే సినిమా థియేటర్

Mahindra XEV 9e CineLux : భారతీయ ఎస్‌యూవీ దిగ్గజం మహింద్రా అండ్ మహింద్రా, ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన పట్టును మరింత బిగించేందుకు సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. తన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ శ్రేణిలో XEV 9e సినీలక్స్ ఎడిషన్‌ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ లగ్జరీ మోడల్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.29.35 లక్షలుగా నిర్ణయించారు. ఈ కారు బుకింగ్‌లు నేటి నుంచే అంటే మార్చి 2, 2026 నుంచి ప్రారంభం కాగా, కేవలం వారం రోజుల వ్యవధిలోనే అంటే మార్చి 10 నుంచి డెలివరీలను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. సాధారణ XEV 9e మోడల్‌తో పోలిస్తే, ఈ సినీలక్స్ ఎడిషన్ మరింత విలాసవంతంగా, అత్యాధునిక ఫీచర్లతో రూపొందించబడింది.

ఈ స్పెషల్ ఎడిషన్ ప్రధానంగా కారు లోపల ఉండే సౌకర్యాలకు, డిజైన్‌కు పెద్దపీట వేసింది. బయట వైపు చూస్తే, సాలిడ్ లుక్ ఇచ్చే సాలిన్ బ్లాక్ మరియు సాలిన్ వైట్ అనే రెండు ప్రత్యేక రంగుల్లో ఈ కారు లభిస్తుంది. కారు లోపలి భాగం చెస్ట్ నట్ బ్రౌన్, నాక్టర్న్ బ్లాక్ రంగుల కలయికలో స్మూత్ లెదర్ ఫినిషింగ్‌తో మెరిసిపోతోంది. డాష్‌బోర్డ్ నుంచి డోర్ ప్యానెల్స్ వరకు ప్రతిదీ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ప్రయాణికులకు ఒక విలాసవంతమైన థియేటర్ అనుభూతిని ఇచ్చేలా కేబిన్‌ను సౌండ్‌ప్రూఫ్‌గా మరియు అత్యంత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు.

సాంకేతికత విషయానికి వస్తే, మహింద్రా XEV 9e సినీలక్స్ ఒక అద్భుతం అని చెప్పాలి. డాష్‌బోర్డ్ అంతటా విస్తరించి ఉండే ట్రిపుల్ హెచ్‌డీ డిస్ప్లే డ్రైవర్‌కు, ప్యాసింజర్‌కు అవసరమైన సమాచారాన్ని, వినోదాన్ని అందిస్తుంది. మ్యూజిక్ లవర్స్ కోసం ఇందులో 16 స్పీకర్లతో కూడిన హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు, ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫినిటీ రూఫ్ (సన్‌రూఫ్), మీకు నచ్చిన రంగులోకి మార్చుకోగలిగే యాంబియంట్ లైటింగ్ సిస్టమ్ కారు లోపల ఒక మాయా ప్రపంచాన్ని సృష్టిస్తాయి. రాత్రి వేళల్లో ఈ కారులో ప్రయాణం ఒక మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది.

సేఫ్టీ, డ్రైవింగ్ అసిస్టెన్స్ కోసం ఇందులో టాప్-ఎండ్ ఫీచర్లను జోడించారు. స్ట్రెయిట్ అహెడ్ విజన్ ఎక్స్ ఆర్గ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్ప్లే, డ్రైవర్ ఏకాగ్రతను గమనించే ఐడెంటిటీ మానిటరింగ్, హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు సెక్యూర్ 360 ప్రో కెమెరా సిస్టమ్, క్యాంప్ మోడ్, పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పా-పాల్ ఏసీ మోడ్ వంటి వినూత్న ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి డ్రైవర్ తన అభిరుచికి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ యూజర్ ప్రొఫైల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు.

పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఇందులో పవర్ఫుల్ 79 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ ఎస్‌యూవీ ఏకంగా 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది 210 kW పవర్‌ను, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల కారు మెరుపు వేగంతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఇది కేవలం రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మార్కెట్లో దీనికి పోటీగా టాటా హారియర్ ఈవీ, బీవైడీ అట్టో 3, హ్యుందాయ్ అయానిక్ 5, టాటా కర్వ్ ఈవీ వంటి మోడళ్లు ఉన్నాయి. కానీ, తనదైన స్టైల్, లగ్జరీతో మహింద్రా సినీలక్స్ ఎడిషన్ వీటన్నింటికీ గట్టి పోటీనిచ్చేలా కనిపిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story