Mahindra: కార్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. మరింత కంఫర్ట్‌తో మహీంద్రా కొత్త కారు
మరింత కంఫర్ట్‌తో మహీంద్రా కొత్త కారు

Mahindra: మహీంద్రా తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలో ఎక్స్ఈవీ 9ఎస్ ద్వారా అత్యంత విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. మూడు వరుసల సీటింగ్ సామర్థ్యంతో వచ్చే ఈ ఫ్యామిలీ ఎస్‌యూవీ 79 కిలోవాట్ అవర్ వరకు శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తుంది. కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కంపెనీ రెండవ వరుసలో ప్రత్యేకమైన క్యాప్టెన్ సీట్లను ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన, లగ్జరీ రైడింగ్ అనుభూతి లభించనుంది. మార్కెట్‌లో టాటా హ్యారియర్ ఈవీ, కియా కేరెన్స్ క్లావిస్ ఈవీ, బివైడి ఈమాక్స్ 7 వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
రూ.20 వేల వ్యత్యాసంతో లగ్జరీ
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ 6 సీటర్ క్యాప్టెన్ సీట్ వేరియంట్లు 7 సీటర్ మోడళ్లతో పోలిస్తే సరిగ్గా రూ. 20,000 మాత్రమే అదనపు ధరను కలిగి ఉన్నాయి. ప్యాక్ టూ ఎబోవ్ 70 కిలోవాట్ అవర్ 7 సీటర్ మోడల్ ధర రూ. 25.80 లక్షలు ఉండగా, కొత్త 6 సీటర్ వేరియంట్ ధర రూ. 26 లక్షలుగా నిర్ణయించారు. అదేవిధంగా ప్యాక్ టూ ఎబోవ్ 79 కిలోవాట్ అవర్ 7 సీటర్ వేరియంట్ రూ. 26.70 లక్షలకు లభిస్తుంటే, 6 సీటర్ వెర్షన్ రూ. 26.90 లక్షలకు అందుబాటులో ఉంది. ప్యాక్ త్రీ 70 కిలోవాట్ అవర్ 6 సీటర్ ధర రూ. 28.80 లక్షలు కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ప్యాక్ త్రీ ఎబోవ్ 79 కిలోవాట్ అవర్ 6 సీటర్ వెర్షన్ రూ. 30.90 లక్షల శ్రేణిలో లభిస్తుంది.
అత్యాధునిక టెక్నాలజీ - ట్రిపుల్ స్క్రీన్ సెటప్
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ విభాగంలో కళ్లు చెదిరే ఫీచర్లు ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్‌పై మూడు 12.3 ఇంచుల భారీ డిస్‌ప్లే స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకటి పాసింజర్ స్క్రీన్, మరొకటి ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, మూడవది డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేగా పనిచేస్తాయి. వీటితో పాటు అన్ని వేరియంట్లలోనూ పెద్ద పనోరమిక్ సన్ రూఫ్ ప్రామాణికంగా లభిస్తుంది. వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, మెమరీ ఫంక్షన్‌తో కూడిన ఫ్రంట్ పవర్డ్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన సౌకర్యాలు ఈ వాహనంలో అమర్చారు.
సేఫ్టీలో నో కాంప్రమైజ్
ప్రయాణికుల భద్రతకు మహీంద్రా అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఈ ఎస్‌యూవీలో అత్యంత అధునాతన లెవెల్-2 ఏడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) సాంకేతికతను అందించారు. దీనికి తోడు 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు వంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి.

