Mahindra XEV 9S: భారత కార్ల మార్కెట్లో మహీంద్రా మరోసారి తన సత్తా చాటింది. ముఖ్యంగా ఫ్యామిలీ కోసం 7 సీటర్ కారు కొనాలనుకునేవారికి ఆసక్తికరమైన వార్త చెప్పింది. కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ SUV మహీంద్రా XEV 9S క్రాష్ టెస్టులో అదరగొట్టింది. భారత్ NCAP నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. దీంతో భారత్ NCAP నుంచి 5 స్టార్ రేటింగ్ పొందిన తొలి 7 సీటర్ ఎలక్ట్రిక్ SUVగా నిలిచింది. అంతేకాదు ఇప్పటివరకు పరీక్షించిన 7 సీటర్ కార్లలో అత్యధిక స్కోర్ సాధించి మరో రికార్డు సృష్టించింది.

క్రాష్ టెస్టులో ఎన్ని మార్కులు వచ్చాయంటే?

మహీంద్రా XEV 9S క్రాష్ టెస్టులో రెండు విభాగాల్లో మంచి మార్కులు సాధించింది. పెద్దవారి రక్షణ విభాగంలో 32 మార్కులకు గానూ 31.15 మార్కులు దక్కించుకుంది. చిన్నపిల్లల రక్షణ విభాగంలో 49 మార్కులకు గానూ 45 మార్కులు సాధించింది. ఈ రెండు విభాగాలను కలిపి మొత్తం 81 మార్కులకు 76.15 మార్కులు పొందింది. ఈ ఫలితాలతో 7 సీటర్ కార్ల విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ప్రయాణించే పెద్దవారితో పాటు పిల్లలకు కూడా మెరుగైన రక్షణ కల్పించేలా దీని నిర్మాణం ఉందని ఈ పరీక్షల ఫలితాలు సూచిస్తున్నాయి.

సఫారీ, ఇన్నోవా హైక్రాస్‌ను వెనక్కి నెట్టిన XEV 9S

7 సీటర్ కార్ల భద్రతా స్కోర్లను పరిశీలిస్తే మహీంద్రా XEV 9S మొదటి స్థానంలో ఉంది. ఇదే కంపెనీకి చెందిన XUV 7XO 75.73 మార్కులతో రెండో స్థానంలో నిలిచింది. టయోటా ఇన్నోవా హైక్రాస్ 75.47 మార్కులు, మారుతి ఇన్విక్టో 75.43 మార్కులు సాధించాయి. టాటా సఫారీకి 74.62 మార్కులు వచ్చాయి. వీటన్నింటినీ వెనక్కి నెట్టి XEV 9S 76.15 మార్కులతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అయితే భారత్ NCAP పరీక్షించిన అన్ని కార్లను కలిపి చూస్తే ఈ SUV ఆరో స్థానంలో ఉంది. ఈ జాబితాలో మహీంద్రా XEV 9e, టాటా హారియర్ EV చెరో 77 మార్కులతో మొదటి స్థానంలో ఉన్నాయి.

మూడో ఎలక్ట్రిక్ SUVకి కూడా 5 స్టార్ రేటింగ్

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ఉపయోగిస్తున్న INGLO ప్లాట్‌ఫామ్ ప్రత్యేకతను ఈ ఫలితాలు మరోసారి చూపించాయి. ఈ ప్లాట్‌ఫామ్‌పై తయారైన XEV 9e, BE 6 ఇప్పటికే భారత్ NCAP నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించాయి. ఇప్పుడు అదే ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన XEV 9S కూడా ఈ జాబితాలో చేరింది. దీంతో ఈ ప్లాట్‌ఫామ్‌పై తయారైన మూడు ఎలక్ట్రిక్ SUVలకు 5 స్టార్ రేటింగ్ లభించినట్లయింది. మహీంద్రా XEV 9Sను 2025 నవంబర్‌లో భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.19.95 లక్షలుగా ఉంది. ఇందులో 59 kWh, 70 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

7 ఎయిర్‌బ్యాగులు, ADAS

మహీంద్రా XEV 9Sలో వేరియంట్‌ను బట్టి భద్రతా సదుపాయాలు మారుతాయి. ప్యాక్ వన్ ఎబౌవ్, ప్యాక్ టు ఎబౌవ్ వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగులు అందిస్తున్నారు. ప్యాక్ త్రీ, ప్యాక్ త్రీ ఎబౌవ్ వేరియంట్లలో డ్రైవర్ కోసం ప్రత్యేకంగా మోకాళ్ల దగ్గర ఎయిర్‌బ్యాగ్ కూడా ఉంది. దీంతో మొత్తం ఎయిర్‌బ్యాగుల సంఖ్య ఏడుకు చేరుతుంది. టాప్ వేరియంట్‌లో Level 2+ ADAS సదుపాయం కూడా ఉంది. ఇందులో ఐదు రాడార్లు, ఒక ఫ్రంట్ కెమెరా ఉంటాయి. ఇవి డ్రైవర్‌కు రోడ్డుపై పరిస్థితులను గుర్తించడంలో సహాయపడతాయి. ప్యాక్ త్రీ ఎబౌవ్ వేరియంట్‌లో Eyedentity డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, Secure360 ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటి ద్వారా కారులోని డ్రైవర్ పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు వాహనాన్ని లైవ్‌లో గమనించడం, రికార్డింగ్ చేయడం సాధ్యమవుతుంది.

Next Story