Mahindra XEV 9S: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ఆగస్టు 2026లో దేశవ్యాప్తంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు సంబంధించిన తాజా గణాంకాలు విడుదలయ్యాయి. ఆటోపండిత్ నివేదిక ప్రకారం.. ఆగస్టు నెలలో మహీంద్రా సంస్థకు చెందిన మహీంద్రా XEV 9S దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కార్‌గా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అత్యంత ప్రజాదరణ పొందిన టాటా పంచ్ ఈవీని అతి స్వల్ప తేడాతో వెనక్కి నెట్టి ఈ సరికొత్త త్రీ-రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

మహీంద్రా XEV 9S అమ్మకాలు

ఆగస్టు నెలలో మహీంద్రా డీలర్లకు ఏకంగా 4,508 యూనిట్ల XEV 9S కార్లను పంపింది. ఇదే సమయంలో టాటా పంచ్ ఈవీ 4,430 యూనిట్ల డిస్పాచ్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు కార్ల మధ్య కేవలం 78 యూనిట్ల తేడా మాత్రమే ఉంది. గత జూలై నెలతో పోలిస్తే మహీంద్రా XEV 9S అమ్మకాల్లో దాదాపు 9.1 శాతం వృద్ధి నమోదయింది. ఈ కారు మూడు వేర్వేరు బ్యాటరీ ఆప్షన్లలో (59kWh, 70kWh, 79kWh) లభిస్తుంది. పూర్తి ఛార్జ్‌పై వేరియంట్‌ను బట్టి 521 కి.మీ నుంచి 679 కి.మీ వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.20.65 లక్షలుగా ఉంది.

టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ హవా కొనసాగింపు

మొదటి స్థానాన్ని కోల్పోయినప్పటికీ, టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మార్కెట్లో తన స్ట్రాంగ్ పట్టును నిరూపించుకుంది. టాటా పంచ్ ఈవీ గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఏకంగా మూడు రెట్లు అధిక అమ్మట్లను నమోదు చేసింది. అలాగే టాటా నెక్సాన్ ఈవీ 3,975 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచింది. దీని అమ్మకాల్లో ఏడాది ప్రాతిపదికన 44 శాతం వృద్ధి కనిపిచింది. ఇక ఎంజీ విండ్సర్ ఈవీ నాలుగో స్థానంలో నిలవగా, టాటా హారియర్ ఈవీ ఐదో స్థానాన్ని దక్కించుకుంది.

టాప్-10 లిస్టులో టాటా మోటార్స్ ఐదు ఈవీలు హవా

ఆగస్టు నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 ఎలక్ట్రిక్ కార్ల జాబితాను పరిశీలిస్తే, అందులో ఒక్క టాటా మోటార్స్ కంపెనీ నుంచే ఏకంగా 5 మోడల్స్ చోటు దక్కించుకోవడం విశేషం. ఈ జాబితాలో పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, హారియర్ ఈవీ, సియెర్రా ఈవీ, టియాగో ఈవీ ఉన్నాయి. ఈ ఐదు కార్లు కలిపి మొత్తంగా 14,168 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనిని బట్టి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా, మహీంద్రా కంపెనీల మధ్య ఈవీల విభాగంలో తీవ్రమైన పోటీ నెలకొందని స్పష్టమవుతోంది.

Next Story