XEV 9S vs Carens Clavis EV: మార్కెట్‌లో ఈవీల పోరు..మహీంద్రా XEV 9S vs కియా కారెన్స్ క్లావిస్ EV..ఏది బెస్ట్ ?
మహీంద్రా XEV 9S vs కియా కారెన్స్ క్లావిస్ EV..ఏది బెస్ట్ ?

XEV 9S vs Carens Clavis EV: భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆల్-ఎలక్ట్రిక్ 7-సీటర్ SUV సెగ్మెంట్‌లో పోటీ తీవ్రమైంది. మహీంద్రా తాజాగా తన కొత్త XEV 9S మోడల్‌ను ఆరు వేరియంట్లలో రూ.19.95 లక్షల ధర(ఎక్స్-షోరూమ్)తో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్, ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న కియా కారెన్స్ క్లావిస్ ఈవీకి గట్టి పోటీని ఇస్తోంది. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్ల ధరలు, బ్యాటరీ సామర్థ్యం, ఫీచర్లలో తేడాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
బ్యాటరీ సామర్థ్యం, పవర్ అవుట్‌పుట్
బ్యాటరీ సామర్థ్యం విషయంలో మహీంద్రా XEV 9S పై చేయి సాధించింది. ఇది మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందిస్తోంది: 59 kWh, 70 kWh, 79 kWh. ఈ బ్యాటరీలు వరుసగా 170 kW, 180 kW, 210 kW పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనికి భిన్నంగా కియా కారెన్స్ క్లావిస్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. 42 kWh, 51.4 kWh. ఇవి 99 kW, 126 kW పవర్ అవుట్‌పుట్‌తో పాటు, 255 Nm టార్క్‌ను జనరేట్ చేస్తాయి. రేంజ్ విషయానికి వస్తే, కియా కారెన్స్ క్లావిస్ 42 kWh బ్యాటరీతో 404 కి.మీ, 51.4 kWh బ్యాటరీతో 490 కి.మీ రేంజ్‌ను ఇస్తుందని చెబుతున్నారు. మహీంద్రా XEV 9S అధిక బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ రేంజ్, పవర్ అందించగలదు.
ఇంటీరియర్ ఫీచర్స్, లగ్జరీ
ఫీచర్ల పరంగా రెండు కార్లు పోటీ పడుతున్నా, మహీంద్రా XEV 9S లగ్జరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. XEV 9S లో పవర్డ్ బాస్ మోడ్, వెంటిలేటెడ్ సెకండ్ రో సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, డాల్బీ అట్మోస్‌తో కూడిన 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ సిస్టమ్ వంటి అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో మూడు పెద్ద స్క్రీన్‌లు, 5G కనెక్టివిటీ వంటివి కేబిన్ అనుభవాన్ని పెంచుతాయి. మరోవైపు కియా కారెన్స్ క్లావిస్ ఈవీ దాని ఐసీఈ వెర్షన్ (పెట్రోల్/డీజిల్) నుంచి చాలా ఫీచర్లను తీసుకుంది. ఇందులో 26.62 అంగుళాల డ్యూయల్ పనోరమిక్ డిస్‌ప్లే, 64-రంగుల యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధరలు,వేరియంట్ల పోలిక
రెండు కార్లు ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.. కానీ వాటి ధరల్లో తేడా ఉంది. కియా కారెన్స్ క్లావిస్ ఈవీ ప్రారంభ ధర రూ.17.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని టాప్ వేరియంట్ ధర రూ.24.49 లక్షలు.మహీంద్రా XEV 9S ప్రారంభ ధర రూ.19.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని టాప్ వేరియంట్ ధర రూ.29.45 లక్షలు.
కియా కారెన్స్ క్లావిస్ ఈవీ తక్కువ ధరలో ప్రారంభమవుతుండగా, మహీంద్రా XEV 9S ఎక్కువ బ్యాటరీ ఆప్షన్లు, ప్రీమియం ఫీచర్ల కారణంగా రూ.2 లక్షల అధిక ధరతో మొదలవుతోంది. కస్టమర్ తమ బడ్జెట్‌ను, రేంజ్ అవసరాన్ని బట్టి ఈ రెండు పవర్ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

