7-Seater SUVs : మారుతి, టయోటా మాస్టర్ ప్లాన్.. 7-సీటర్ సెగ్మెంట్‌లో సరికొత్త యుద్ధం మొదలు
7-సీటర్ సెగ్మెంట్‌లో సరికొత్త యుద్ధం మొదలు

7-Seater SUVs :ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో మహీంద్రా XUV 7XO హవా కొనసాగుతోంది. తన పవర్‌ఫుల్ ఇంజిన్, అదిరిపోయే ఫీచర్లతో ప్రీమియం ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్‌లో ఈ కారు రారాజుగా వెలుగొందుతోంది. అయితే, మహీంద్రా హుందాతనానికి సవాల్ విసిరేందుకు దిగ్గజ కార్ల కంపెనీలు మారుతి సుజుకి, టయోటా, ఎంజీ మోటార్స్ రంగంలోకి దిగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా మూడు సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీలను లాంచ్ చేసి ఎక్స్‌యూవీకి గట్టి పోటీ ఇచ్చేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేశాయి.
మారుతి నుంచి కొత్త ప్రీమియం 7-సీటర్ (Y17)
మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ గ్రాండ్ విటారా ఆధారంగా ఒక కొత్త 7-సీటర్ ఎస్‌యూవీని (కోడ్ నేమ్: Y17) తీసుకురాబోతోంది. ఇది చూడటానికి గ్రాండ్ విటారా లాగే ఉన్నా, పొడవు ఎక్కువగా ఉండటం వల్ల లోపల స్పేస్ చాలా విశాలంగా ఉంటుంది. ఇందులో మూడు వరుసల సీట్లు ఉంటాయి. కేవలం డిజైన్ మాత్రమే కాదు, ఈ కారులో ఈవిటారా (e-Vitara) నుంచి తీసుకున్న కొన్ని స్టైలిష్ ఫీచర్లు కూడా ఉండబోతున్నాయని సమాచారం. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.
టయోటా హైరైడర్ 7-సీటర్
టయోటా కూడా మారుతి తో కలిసి తన హైరైడర్ మోడల్‌ను 7-సీటర్ వెర్షన్‌లో లాంచ్ చేయనుంది. ఇటీవల దీని టెస్ట్ మోడల్‌ను రోడ్లపై చూసినప్పుడు, ఇందులో ఆల్‌గ్రిప్ (AWD) డ్రైవ్‌ట్రెయిన్ సిస్టమ్ ఉన్నట్లు తెలిసింది. అంటే గుంతల రోడ్లపై కూడా ఇది దూసుకుపోతుంది. 1.5 లీటర్ K15C పెట్రోల్ ఇంజిన్‌తో పాటు పవర్‌ఫుల్ హైబ్రిడ్ టెక్నాలజీ ఇందులో ఉండబోతోంది. లగేజ్ స్పేస్ కోసం వెనుక వైపు డిజైన్ లో కొన్ని మార్పులు చేసి, అదనపు సీట్లను అమర్చారు.
ఎంజీ స్టార్‌లైట్ 560
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా నుంచి 2026 దీపావళి నాటికి స్టార్‌లైట్ 560 అనే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) ఎస్‌యూవీ రాబోతోంది. ఇది చూడటానికి చాలా మోడ్రన్‌గా, క్లోజ్డ్ గ్రిల్, స్పెషల్ ఎల్ఈడీ లైటింగ్‌తో ఆకట్టుకుంటుంది. గ్లోబల్ మార్కెట్‌లో ఇది ఎలక్ట్రిక్, హైబ్రిడ్ రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఇండియాలో కూడా ఈ రెండింటిని లాంచ్ చేసే అవకాశం ఉంది. మైలేజ్ తో పాటు ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే వారిని ఈ కారు మైమరపిస్తుంది.
మహీంద్రా XUV 7XOకి ముప్పు ఎక్కడ?
మహీంద్రా XUV 7XO ప్రస్తుతం టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కజార్ వంటి కార్లతో పోటీ పడుతోంది. అయితే మారుతి, టయోటా నుంచి వచ్చే కార్లు ప్రధానంగా మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండటం వల్ల కస్టమర్లు అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు పెట్రోల్ ఖర్చులను తగ్గిస్తాయి. ఎంజీ స్టార్‌లైట్ వంటి మోడళ్లు ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కూడా పోటీని పెంచుతాయి. ఈ పోటీ వల్ల కార్ల కంపెనీలు తమ ధరలను తగ్గించే అవకాశం ఉండటం కస్టమర్లకు కలిసొచ్చే అంశం.

