Mahindra: దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా నుంచి వచ్చిన సరికొత్త ఎస్‌యూవీ మహీంద్రా ఎస్‌యూవీ 7ఎక్స్‌వో భద్రతా విషయంలో అదరగొట్టింది. తాజాగా నిర్వహించిన భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో ఈ కారు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. కేవలం పెద్దల రక్షణలోనే కాకుండా, చిన్నారుల భద్రత విషయంలోనూ ఈ ఎస్‌యూవీ అత్యధిక స్కోర్‌ను సాధించి కుటుంబ సమేతంగా ప్రయాణించడానికి ఇది ఎంతో సురక్షితమైన వాహనమని నిరూపించింది.

టెస్టింగ్ వేరియంట్లు, అడల్ట్ సేఫ్టీ స్కోర్ వివరాలు

భారత్ ఎన్‌క్యాప్ సంస్థ XUV 7XOకి చెందిన రెండు వేరియంట్లను (AX7 DSL 2W 7S AT, AX7L DSL 4W 7S AT) ఈ క్రాష్ టెస్ట్‌కు గురిచేసింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో ఈ కారు ఏకంగా 32కి గాను 30.76 మార్కులు సాధించింది. సాధారణంగా 5-స్టార్ రేటింగ్ రావడానికి 27 మార్కులు సరిపోతాయి, కానీ ఈ ఎస్‌యూవీ ఆ పరిమితిని దాటి అద్భుతమైన స్కోర్ సాధించింది. ముఖ్యంగా సైడ్-మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 100 శాతం మార్కులు సాధించడం విశేషం.

చిన్నారుల రక్షణలోనూ నంబర్ వన్

కేవలం పెద్దల భద్రతే కాకుండా, ప్రయాణంలో పిల్లల రక్షణ విషయంలోనూ XUV 7XO అద్భుతమైన మార్కులు సాధించింది. ఈ టెస్ట్‌లో మొత్తం 49 మార్కులకు గాను 44.97 మార్కులను సొంతం చేసుకుంది. డైనమిక్ క్రాష్ టెస్ట్‌లో 24కి 23.97 మార్కులు, చైల్డ్ సీట్ ఇన్‌స్టాలేషన్ టెస్ట్‌లో పూర్తి స్థాయిలో 12కి 12 మార్కులు సాధించింది. ISOFIX యాంకర్ల ద్వారా అమర్చిన చైల్డ్ సీట్లు ప్రయాణ సమయంలో పిల్లలకు పూర్తి రక్షణ కల్పిస్తున్నట్లు టెస్ట్‌లో తేలింది.

అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లు, టెక్నాలజీ

ఈ ఎస్‌యూవీలో ప్రయాణికుల భద్రత కోసం కంపెనీ అత్యాధునిక ఫీచర్లను అందించింది.

* డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, మూడు వరుసల సీట్లను కవర్ చేసే కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

* ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఫ్రంట్ సీట్-బెల్ట్ ప్రీటెన్షనర్లు, అన్ని సీట్లకు సీట్-బెల్ట్ రిమైండర్ స్టాండర్డ్‌గా ఇచ్చారు.

* దీనితో పాటు లెవల్ 2 ఏడీఏఎస్ ప్యాకేజీ కింద అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

ధర, వేరియంట్ల వివరాలు

అద్భుతమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, 7-సీటర్ విశాలమైన స్పేస్ కలిగిన మహీంద్రా XUV 7XO ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.13.99 లక్షలుగా ఉంది. ఇక దీని టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.25.49 లక్షల వరకు ఉంటుంది. కుటుంబంతో కలిసి సురక్షితమైన, లాంగ్ డ్రైవ్‌లు వెళ్లాలనుకునే వారికి ఈ ఎస్‌యూవీ ఒక చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు.

Next Story