ఫ్యామిలీ కోసం ఏ ఎస్‌యూవీ బెస్ట్ ?

XUV7XO Vs Safari : ఫ్యామిలీతో కలిసి దూరప్రయాణాలు చేయాలన్నా, రోడ్డుపై రాజసం ఉట్టిపడాలన్నా భారతీయులు మొదట చూసేది 7-సీటర్ ఎస్‌యూవీల వైపే. ప్రస్తుతం ఈ విభాగంలో టాటా సఫారీ, కొత్తగా లాంచ్ అయిన మహీంద్రా XUV 7XO మధ్య అసలైన యుద్ధం నడుస్తోంది. XUV700కి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా వచ్చిన XUV 7XO ఇప్పుడు సరికొత్త హంగులతో మెరిసిపోతోంది. మరి మీ అవసరాలకు, బడ్జెట్‌కు ఈ రెండింటిలో ఏది బెస్ట్? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర విషయానికి వస్తే, మహీంద్రా చాలా తెలివిగా తన పావులను కదిపింది.

మహీంద్రా XUV 7XO: దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.13.66 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ రూ.24.92 లక్షల వరకు ఉంది.

టాటా సఫారీ: సఫారీ బేస్ మోడల్ ధర రూ.13.29 లక్షల వద్ద కొంచెం తక్కువకే మొదలైనప్పటికీ, దీని టాప్ మోడల్ ధర మాత్రం రూ.25.96 లక్షల వరకు ఉంది. అంటే, ప్రారంభ ధరలో సఫారీ కాస్త తక్కువగా ఉన్నా, ఫీచర్ల పరంగా చూస్తే XUV 7XO మంచి వాల్యూ ఫర్ మనీగా కనిపిస్తోంది.

ఇంజిన్ సామర్థ్యం

ఇంజిన్ పనితీరులో మహీంద్రా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది.

పెట్రోల్: XUV 7XOలో 2.0L టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది 200 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. సఫారీలోని 1.5L టర్బో పెట్రోల్ కేవలం 170 PS మాత్రమే ఇస్తుంది.

డీజిల్: XUV 7XO డీజిల్ ఇంజిన్ 185 PS పవర్, 450 Nm టార్క్‌ను ఇస్తుంది. సఫారీ డీజిల్ మాత్రం 168 PS పవర్, 350 Nm టార్క్‌కే పరిమితం అవుతుంది. ముఖ్యంగా మహీంద్రాలో AWD (ఆల్ వీల్ డ్రైవ్) ఆప్షన్ ఉంది. అంటే కొండ ప్రాంతాల్లో, మట్టి రోడ్లపై ప్రయాణించే వారికి XUV 7XO తిరుగులేని ఆప్షన్. సఫారీ కేవలం ఫ్రంట్ వీల్ డ్రైవ్‌కే పరిమితం.

ఇంటిరియర్, ఫీచర్లు

మహీంద్రా XUV 7XO: ఇందులో ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్ (మూడు 12.3 అంగుళాల స్క్రీన్లు) ఉంది. డ్రైవర్, ఇన్ఫోటైన్‌మెంట్ మాత్రమే కాకుండా ప్యాసింజర్ కోసం కూడా ప్రత్యేక స్క్రీన్ ఇవ్వడం విశేషం. 16-స్పీకర్ల హర్మాన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, 540-డిగ్రీ కెమెరా, ఛాట్‌జిపిటి సపోర్ట్ వంటి ఫీచర్లు దీని సొంతం.

టాటా సఫారీ: సఫారీలో 14.5 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్, జెబిఎల్ సౌండ్ సిస్టమ్, జెస్చర్ కంట్రోల్డ్ టెయిల్‌గేట్ (కాళ్లు ఆడిస్తే డిక్కీ తెరుచుకోవడం), డ్యూయల్ డ్యాష్‌క్యామ్ వంటి ప్రాక్టికల్ ఫీచర్లు ఉన్నాయి. స్పేస్ విషయానికి వస్తే, XUV 7XO పొడవు, వీల్‌బేస్ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల మూడో వరుసలో కూర్చునే వారికి కాస్త ఎక్కువ లెగ్‌రూమ్ దొరుకుతుంది. అయితే, సఫారీ వెడల్పుగా ఉండటం వల్ల ముగ్గురు పక్కపక్కన కూర్చున్నప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది.

సేఫ్టీలో ఎవరు తోపు?

సేఫ్టీ విషయంలో ఈ రెండూ దేనికదే సాటి. రెండు కార్లకు 5-స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్ ఉంది. రెండింటిలోనూ లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), 7 ఎయిర్‌బ్యాగ్‌లు, డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, XUV 7XOలో అదనంగా ఉన్న 540-డిగ్రీ కెమెరా కారు కింద భాగంలో ఏముందో కూడా చూపిస్తుంది, ఇది ఆఫ్-రోడింగ్‌లో చాలా కీలకం.

PolitEnt Media

PolitEnt Media

Next Story