Mahindra XUV 7XO : మార్కెట్‌లో ప్రకంపనలు ఖాయం..కొత్త పేరుతో దిగుతున్న మహింద్రా XUV700
కొత్త పేరుతో దిగుతున్న మహింద్రా XUV700

Mahindra XUV 7XO : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన, పవర్‌ఫుల్ ఎస్‌యూవీలలో మహీంద్రా XUV700 ఒకటి. ఇప్పుడు ఈ మోడల్ పెద్ద మార్పులతో సరికొత్త రూపంలో మార్కెట్లోకి రాబోతోంది. దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా, తమ అప్‌డేటెడ్ XUV700 ను టీజ్ చేయగా దీనిని ఇకపై మహీంద్రా XUV 7XO అనే కొత్త పేరుతో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇటీవల XUV300 ను XUV 3XO గా రీబ్రాండ్ చేసిన విజయవంతమైన వ్యూహంలో భాగంగానే XUV700 కి కూడా పేరు మార్చారు. ప్రస్తుతం ఉన్న XUV700 తో పోలిస్తే కొత్త XUV 7XO పూర్తిగా కొత్త డిజైన్, అధునాతన ఫీచర్లతో వస్తుంది.
కొత్త మహీంద్రా XUV 7XO కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న కస్టమర్‌ల కోసం కంపెనీ బుకింగ్ తేదీలను ప్రకటించింది. డిసెంబర్ 15, 2025 మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రీ-బుకింగ్స్ మొదలవుతాయి. ఆసక్తిగల కస్టమర్‌లు కేవలం రూ.21,000 టోకెన్ అమౌంట్‌తో ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు. ఈసారి ప్రీ-బుకింగ్ సమయంలోనే కస్టమర్‌లు తమకు నచ్చిన డీలర్‌షిప్, ఫ్యూయల్ టైప్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను ఎంచుకునే సౌలభ్యాన్ని మహీంద్రా కల్పించింది. బుకింగ్స్ మహీంద్రా షోరూమ్‌లతో పాటు కంపెనీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఈ కొత్త ఎస్‌యూవీ వచ్చే ఏడాది జనవరి 5న అధికారికంగా విడుదల కానుంది.
కొత్త XUV 7XO లో బాహ్య రూపంలో గణనీయమైన మార్పులు చేశారు. ముందు భాగంలో డ్యుయల్-పాడ్ LED హెడ్‌ల్యాంప్స్‌తో పాటు, రివర్స్ L ఆకారంలో ఉన్న LED DRLs (డే-టైమ్ రన్నింగ్ లైట్స్) ఉంటాయి. వెనుకవైపు మహీంద్రా XEV 9S ను పోలి ఉండే కొత్త LED టెయిల్‌ల్యాంప్స్ ఇచ్చారు. అయితే ఇది కనెక్టెడ్ టెయిల్‌లైట్స్ ట్రెండ్‌కు భిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు. సరికొత్త బ్లాక్ గ్రిల్, సిల్వర్ స్లాట్స్, కొత్త డిజైన్‌తో కూడిన బంపర్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి.
ఇక ఎస్‌యూవీ క్యాబిన్ పూర్తిగా కొత్త డిజైన్‌తో, మెరుగైన క్వాలిటీ గల మెటీరియల్‌ను ఉపయోగించి మరింత ప్రీమియంగా మార్చబడింది. ఇందులో అతిపెద్ద ఆకర్షణగా XEV 9S లో ఉన్నట్లుగా, ట్రిపుల్-స్క్రీన్ సెటప్ నిలుస్తుంది. సాఫ్ట్-టచ్ డాష్‌బోర్డ్, డ్యుయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, వెంటిలేషన్ ఫీచర్‌తో పాటు స్లైడ్ అయ్యే రెండో వరుస సీట్లు, ప్రయాణికులందరికీ సర్దుబాటు చేసుకునే హెడ్‌రెస్ట్‌లు వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో చేర్చబడతాయి.
కొత్త XUV 7XO ఇంజిన్ ఎంపికలలో పెద్ద మార్పులు లేకపోవచ్చని అంచనా. పాత XUV700 లో ఉన్న శక్తివంతమైన 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్లను కొత్త మోడల్‌లో కూడా కొనసాగించే అవకాశం ఉంది. ట్రాన్స్‌మిషన్ కోసం 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా యథాతథంగా ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త మార్పులు, ఫీచర్లతో XUV 7XO మార్కెట్‌లో మరింత ఆకర్షణీయంగా నిలిచే అవకాశం ఉంది.

