Mahindra Vision S : స్కార్పియో, థార్ ల డిజైన్ కలగలిపి మహీంద్రా కొత్త ఎస్‌యూవీ..క్రెటాకు చుక్కలే
క్రెటాకు చుక్కలే

Mahindra Vision S : భారతీయ ఎస్‌యూవీ దిగ్గజం మహీంద్రా దేశంలో సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త ఎస్‌యూవీని కొత్త మాడ్యులర్ NU IQ ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్నారు. ఇది 2025 ఆగస్టు 15న విజన్ టీ, విజన్ ఎస్, విజన్ ఎస్‌ఎక్స్‌టీ కాన్సెప్ట్‌లతో పాటు ప్రదర్శించబడిన మహీంద్రా విజన్ ఎస్ కాన్సెప్ట్ ప్రొడక్షన్ వెర్షన్ కావచ్చునని భావిస్తున్నారు. ఈ కొత్త ఎస్‌యూవీని మార్కెట్‌లో బేబీ స్కార్పియో అని కూడా పిలుస్తున్నారు. విజన్ ఎస్ కాన్సెప్ట్ స్టైలింగ్ దృఢంగా, నిటారుగా, ఆఫ్-రోడ్ స్టైల్‌ను పోలి ఉంటుంది.
మహీంద్రా విజన్ ఎస్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఇటీవల దీనిని భారీ క్యామోఫ్లాజ్‌తో సాధారణ రోడ్లపై పరీక్షించడం జరిగింది. టెస్ట్ మోడల్‌లో మహీంద్రా ప్రత్యేక గుర్తింపు అయిన నిలువు గీతలతో కూడిన గ్రిల్ ఉంది. ఇందులో గుండ్రటి హెడ్‌ల్యాంప్‌లు, వాటి చుట్టూ LED DRL లను అమర్చారు. ఇవి థార్ రాక్స్ ను పోలి ఉన్నాయి. కాన్సెప్ట్ మాదిరిగానే దీనికి వెనుక టెయిల్‌గేట్‌పై స్పేర్ వీల్ కూడా అమర్చి ఉంది. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో చదరపు ఫాగ్ ల్యాంప్‌లు, దిగువ గ్రిల్‌లో అమర్చిన రాడార్ మాడ్యూల్, ఉబ్బిన వీల్ ఆర్చ్‌లు, పెద్ద చక్రాలు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, చదరపు ఆకారంలో ఉన్న టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి.
స్పై చిత్రాల ప్రకారం.. ప్రొడక్షన్ మహీంద్రా విజన్ ఎస్ లో పనోరమిక్ సన్‌రూఫ్ లభించే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం టాప్ వేరియంట్‌లకు మాత్రమే పరిమితం కావచ్చు. కాన్సెప్ట్ లోని అనేక ఫీచర్లు ఇందులో కొనసాగే అవకాశం ఉంది. డ్యూయల్ స్క్రీన్ సెటప్ (డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్, ఇన్ఫోటైన్‌మెంట్), కొత్త త్రీ-స్పోక్ డ్యూయల్-టోన్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, డోర్ ట్రిమ్స్, సీట్ కవర్లు ఉన్నాయి.
మహీంద్రా కొత్త NU IQ ప్లాట్‌ఫామ్ పెట్రోల్-డీజిల్, ఎలక్ట్రిక్ రెండింటికీ మద్దతు ఇస్తుంది. ప్రారంభంలో విజన్ ఎస్ ను పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో లాంచ్ చేయవచ్చు. తర్వాత దీని ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి లాంచ్‌కు సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. అయితే, ఈ ప్రొడక్షన్ మోడల్ మహీంద్రా విజన్ ఎస్ ఎస్‌యూవీ 2027 సంవత్సరంలో భారతీయ రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

