Mahindra : రేపే మహీంద్రా కొత్త EV లాంచ్.. XEV 9S కారు ధర ఎంత? 500 కి.మీ రేంజ్ వివరాలివే
XEV 9S కారు ధర ఎంత? 500 కి.మీ రేంజ్ వివరాలివే

Mahindra : భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ కారు XEV 9Sను రేపు, నవంబర్ 27, గురువారం నాడు అధికారికంగా లాంచ్ చేయబోతోంది. ఇది మార్కెట్లో ప్రీమియం ఎలక్ట్రిక్ కారుగా విడుదల కానుంది. మహీంద్రా XEV 9S ధర సుమారు రూ.21 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారు మార్కెట్లో విడుదలైన తర్వాత టాటా మోటార్స్ కూడా సియెర్రా ఈవీని లాంచ్ చేయనుంది. సియెర్రా ICE వేరియంట్లు ఇప్పటికే నవంబర్ 25న విడుదలయ్యాయి.
మహీంద్రా XEV 9S ఒక 7-సీటర్ ఎలక్ట్రిక్ కారు. దీని డిజైన్‌లో ముందు భాగంలో బోల్డ్ లుక్ ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ డీఆర్‌ఎల్స్, లైట్ బార్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి. అంతేకాకుండా మహీంద్రా టీజర్‌లో చూపించినట్లుగా ఈ ఈవీలో పెద్ద ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉంటుంది. వెనుక వైపు షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, సరికొత్త బ్యాడ్జింగ్ ఉండనుంది. ఈ కారు 59 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో రావచ్చని అంచనా. మహీంద్రా కొత్త ఈవీ సింగిల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
మహీంద్రా XEV 9S లో ప్రయాణీకుల సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ 7-సీటర్ కారులో 7 ఎయిర్‌బ్యాగ్స్ ఉండే అవకాశం ఉంది (మహీంద్రా XEV 9e లో కూడా 7 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి). సేఫ్టీ కోసం EBD తో పాటు ABS కూడా ఉంటుంది. దీంతో పాటుగా ట్రాక్షన్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు కూడా లభించవచ్చు. అదనంగా అడ్వాన్సుడ్ ADAS (Advanced Driver Assistance Systems) సిస్టమ్, పిల్లల సేఫ్టీ కోసం ISOFIX ఫీచర్ కూడా ఈ కొత్త ఎలక్ట్రిక్ కారులో ఉండే అవకాశం ఉంది.

