Maruti Baleno: తక్కువ ధరలో అత్యధిక ఫీచర్లు.. బాలెనోలో పైసా వసూల్ అనిపించే వేరియంట్ ఇదే
పైసా వసూల్ అనిపించే వేరియంట్ ఇదే

Maruti Baleno: దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇటీవల భారత మార్కెట్లో తన సరికొత్త బాలెనో ఫేస్‌లిఫ్ట్ 2026 కార్లను లాంచ్ చేసింది. ఈసారి ఈ కారు డిజైన్, ఇంజిన్, అడ్వాన్సుడ్ ఫీచర్లలో అనేక పెద్ద మార్పులను తీసుకొచ్చారు. కొత్త బాలెనో ప్రారంభ ఎక్స్ షోరూం ధర రూ.5.99 లక్షలు ఉండగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.9.99 లక్షల వరకు ఉంది. మార్కెట్లో ఇది టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20 వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.
కొత్త బాలెనో కొనుగోలు చేయాలనుకునే వారికి ఏ వేరియంట్ బెస్ట్ అనే సందేహం వస్తుంటుంది. చాలామంది జీటా వేరియంట్ వైపు మొగ్గు చూపినప్పటికీ, ధర ఫీచర్ల పరంగా చూస్తే మాత్రం డెల్టా వేరియంట్ పైసా వసూల్ మోడల్‌గా నిలుస్తుంది. బాలెనో డెల్టా ఎక్స్ షోరూం ధర రూ.7 లక్షల నుంచి రూ.7.92 లక్షల మధ్య ఉండగా, జీటా వేరియంట్ ధర రూ.8 లక్షల నుంచి రూ.8.92 లక్షల వరకు ఉంటుంది. అంటే డెల్టా కొనుగోలు చేయడం ద్వారా మీరు దాదాపు రూ.లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు.
తక్కువ ధరకే లభించినప్పటికీ, డెల్టా వేరియంట్‌లో అనేక ముఖ్యమైన ఫీచర్లను అందించారు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేసే 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు లభిస్తాయి. సిల్వర్ ఇన్‌సర్ట్‌లతో కూడిన కొత్త గ్రిల్, హలోజన్ ప్రాజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 15-అంగుళాల స్టీల్ వీల్స్ విత్ వీల్ కవర్స్, షార్క్-ఫిన్ ఆంటెన్నా అందించారు. అలాగే బ్లూ, గ్రే డ్యూయల్-టోన్ కేబిన్, ఫ్రంట్ స్లైడింగ్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, వెనుక వైపు ఏసీ వెంట్లు, టైప్-సీ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.
కొత్త బాలెనోలో సరికొత్త Z-సిరీస్ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. డెల్టా వేరియంట్‌లో మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు రెండూ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా దీనిలో సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ కూడా ఉండటం దీని ప్రత్యేకతను మరింత పెంచుతుంది. స్ప్లెండిడ్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్, సెలెస్టియల్ బ్లూ, బ్లూయిష్ బ్లాక్, గ్రాండ్యూయర్ గ్రే, ఒప్యులెంట్ రెడ్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. బడ్జెట్ ధరలో అన్ని ఆధునిక హంగులతో కూడిన ప్రీమియం కారు కోరుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!

