Maruti Baleno: ప్రీమియం లుక్.. కళ్లు చెదిరే ఫీచర్లు.. సెప్టెంబర్ 5న మార్కెట్లోకి కొత్త మారుతీ బలేనో
కొత్త మారుతీ బలేనో

Maruti Baleno: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మారుతీ బలేనో సరికొత్త అవతారంలో అలరించేందుకు సిద్ధమవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 5 బంపర్ అప్‌డేట్లతో సెప్టెంబర్ 5న మార్కెట్లో అడుగుపెట్టేందుకు తయారవుతున్న ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ విశేషాలు, దాని ప్రత్యేకతలు వివరంగా చూద్దాం. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ కార్ల విక్రయాల్లో మారుతీ సుజుకీ భారతదేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఉన్న సీఎన్‌జీ మోడళ్లలో కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే లభించేది. కొత్తగా రాబోతున్న బలేనో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో సీఎన్‌జీ వెర్షన్‌తో పాటు ఏఎమ్‌టీ (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) ఆప్షన్ అందించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. 1.2 లీటర్, 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను దీనికోసం వినియోగించనున్నారు. ఇది సీఎన్‌జీ మోడ్‌లో దాదాపు 77.5 పీఎస్ పవర్, 98.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు.
వేసవి తాపాన్ని తట్టుకునేలా వెంటిలేటెడ్ సీట్లు
కొత్త బలేనోలో ప్రయాణాన్ని మరింత సుఖమయంగా మార్చేందుకు ముందు వరస సీట్లకు వెంటిలేషన్ సదుపాయాన్ని జోడించనున్నారు. మన దేశంలో ఉండే వేడి వాతావరణంలో సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఈ వెంటిలేటెడ్ సీట్లు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. ఇప్పటికే ఈ కారులోని సీట్లు మంచి అండర్-థై సపోర్ట్ ఇస్తుండగా, కొత్తగా వస్తున్న వెంటిలేషన్ ఫీచర్ వల్ల క్యాబిన్ మరింత లగ్జరీగా, ప్రీమియం అనుభూతిని ఇస్తుంది.
పెద్ద టచ్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం
ప్రస్తుతం అందుబాటులో ఉన్న బలేనో మోడల్‌లో 9 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. నూతన ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌లో దీనిని మరింత పెద్దదిగా చేసి 10.1 ఇంచుల డిస్‌ప్లేగా మార్చనున్నారు. వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉండటం వల్ల వైర్ల అవసరం లేకుండానే స్మార్ట్‌ఫోన్‌ను సులభంగా అనుసంధానించుకోవచ్చు. దీనికి తోడు సెంటర్ కన్సోల్ వద్ద వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా అమర్చుతున్నారు. దీనివల్ల కేబుల్స్ వాడే తిప్పలు తప్పడమే కాకుండా కారు లోపలి భాగం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
సెక్యూరిటీ కోసం లెవెల్ 1 అడాస్ సేఫ్టీ టెక్నాలజీ
కొత్త బలేనోలో తీసుకొస్తున్న అత్యంత కీలకమైన అప్‌డేట్ లెవెల్ 1 అడాస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్). రీయర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, సేఫ్ ఎగ్జిట్ అలర్ట్ వంటి అత్యాధునిక రక్షణ ఫీచర్లు ఇందులో లభించనున్నాయి. టాప్ వేరియంట్లలో ఈ సెక్యూరిటీ ఫీచర్లు లభించే అవకాశం ఉంది. నగరాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడం, లైన్ మారడం, పార్కింగ్ చేయడం వంటి సమయాల్లో ప్రమాదాలు జరగకుండా ఇవి కాపాడతాయి. వీటికి తోడు కొత్త డిజైన్ హెడ్‌ల్యాంప్‌లు, రీ-డిజైన్ చేసిన గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్, సవరించిన వెనుక బంపర్‌తో ఈ కారు ఎక్స్‌టీరియర్ లుక్ మరింత షార్ప్‌గా మారనుంది.

