Baleno vs Glanza: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఈ విభాగంలో మారుతి బాలెనో అలాగే టయోటా గ్లాంజా కార్లు ముందుంటాయి. రెండు కార్ల ఇంజిన్, ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ ధరలో సుమారు 89 వేల రూపాయల తేడా ఉంది. ఈ నేపథ్యంలో ఏ కారు కొనుగోలు చేయడం లాభదాయకమో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ఇంజిన్ పర్ఫామెన్స్, మైలేజ్ వివరాలు

మారుతి బాలెనోఅలాగే టయోటా గ్లాంజా కార్లలో ఒకే రకమైన 1.2 లీటర్ల జెడ్-సిరీస్ త్రి సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 83 హెచ్‌పీ పవర్‌ను అలాగే 112.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్ బాక్స్ విషయానికొస్తే రెండింటిలోనూ 5-స్పీడ్ మాన్యువల్ అలాగే ఏఎంటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ తో పాటు సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉంది. మైలేజ్ పరంగా చూస్తే పెట్రోల్ వేరియంట్ లీటరుకు 23.80 కిలోమీటర్లు, సీఎన్‌జీ వేరియంట్ కిలోకు 33 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. పనితీరు పరంగా రెండు కార్లు ఒకేలా ఉంటాయి.

డిజైన్ అలాగే లగ్జరీ ఫీచర్లు

ఇంజన్ ఒకటే అయినప్పటికీ రెండు కార్ల బాహ్య రూపంలో స్వల్ప తేడాలు కనిపిస్తాయి. టయోటా గ్లాంజా కారులో ప్రత్యేకమైన ఫ్రంట్ గ్రిల్ అలాగే స్పోర్టీ బంపర్ అమర్చారు. మరోవైపు బాలెనో కారు నెక్సా సిగ్నేచర్ డిజైన్ థీమ్‌తో వస్తుంది. ఇంటీరియర్ పరంగా గ్లాంజాలో డ్యూయల్-టోన్ థీమ్ ఉండగా, బలేనోలో మరింత డార్క్ స్పోర్టీ లుక్ లభిస్తుంది. రెండు కార్లలో తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే అలాగే ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

ధరల తేడా, వారంటీ విశేషాలు

మారుతి బాలెనోప్రారంభ ఎక్స్ షోరూం ధర సుమారు రూ.6.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అదే టయోటా గ్లాంజా ప్రారంభ ధర సుమారు 6.99 లక్షల రూపాయలుగా ఉంది. రెండింటి మధ్య సుమారు 89 వేల రూపాయల వ్యత్యాసం ఉంది. ఈ ధరల తేడాకు ప్రధాన కారణం టయోటా బ్రాండ్ వాల్యూ అలాగే మెరుగైన వారంటీ ప్యాకేజీ. గ్లాంజా కొనుగోలు చేస్తే 3 సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ లభిస్తుంది. బాలెనోకు 2 సంవత్సరాలు లేదా 40 వేల కిలోమీటర్ల వారంటీ మాత్రమే ఇస్తారు. అయితే మారుతి సర్వీస్ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా విస్తృతంగా అందుబాటులో ఉంటుంది.

ఏ కారు కొనుగోలు చేయడం మంచిది?

మీ బడ్జెట్ తక్కువగా ఉండి తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న కారు కావాలంటే మారుతి బాలెనో ఉత్తమ ఎంపిక అవుతుంది. ఇది మీ డబ్బును ఆదా చేస్తుంది. ఒకవేళ మీకు టయోటా బ్రాండ్ ఇష్టపడితే, ఎక్కువ కాలం ఉండే వారంటీ ప్యాకేజీ కావాలనుకుంటే అదనపు డబ్బులు చెల్లించి గ్లాంజా కొనుగోలు చేయవచ్చు. తుది నిర్ణయం మీ వ్యక్తిగత ప్రాధాన్యతలు అలాగే బడ్జెట్ పైన ఆధారపడి ఉంటుంది.

Next Story