Maruti Baleno vs Toyota Glanza : బాలెనో vs గ్లాంజా.. ఇంజిన్ ఒక్కటే, ఫీచర్లు ఒక్కటే.. మరి రేటులో ఎందుకు ఇంత తేడా?
ఇంజిన్ ఒక్కటే, ఫీచర్లు ఒక్కటే.. మరి రేటులో ఎందుకు ఇంత తేడా?

Maruti Baleno vs Toyota Glanza : భారతీయ కార్ల మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు అనగానే అందరికీ గుర్తొచ్చేవి మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా. విచిత్రం ఏమిటంటే, ఈ రెండు కార్లు చూడటానికి వేర్వేరు బ్రాండ్లు అయినా, లోపల ఇంజిన్ నుంచి ఫీచర్ల వరకు దాదాపు అన్నీ ఒక్కటే. మారుతి తయారు చేసిన బలెనోనే టయోటా సంస్థ గ్లాంజా పేరుతో అమ్ముతోంది. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏ కారు కొంటే లాభం? ధరల్లో తేడాలు ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ధరల వ్యత్యాసం.. జేబుకు ఏది దగ్గర?
ధర విషయానికి వస్తే మారుతి సుజుకి బలెనో అందరికీ అందుబాటులో ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.9.10 లక్షల వరకు ఉంది. ఇక టయోటా గ్లాంజా విషయానికి వస్తే, దీని ప్రారంభ ధర రూ.6.46 లక్షలు కాగా, టాప్ వేరియంట్ రూ.9.44 లక్షల వరకు పలుకుతోంది. అంటే బలెనో కంటే గ్లాంజా సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖరీదైనది. మధ్యతరగతి కుటుంబాలకు మారుతి బలెనో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ అని చెప్పవచ్చు.
ఇంజిన్, పెర్ఫార్మెన్స్
ఈ రెండు కార్లలోనూ ఒకే రకమైన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను వాడారు. ఇది 88.50 హార్స్‌పవర్, 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ విషయానికి వస్తే 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ (AMT) ఆప్షన్లలో ఇవి లభిస్తున్నాయి. మైలేజీ విషయంలోనూ ఇవి ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లు లీటరుకు 22.35 కి.మీ, ఆటోమేటిక్ వేరియంట్లు 22.94 కి.మీ మైలేజీని ఇస్తాయి. ఇక సిఎన్‌జి ప్రియుల కోసం 30.61 కి.మీ/కేజీ మైలేజీ ఇచ్చే ఆప్షన్ కూడా రెండు కార్లలో అందుబాటులో ఉంది.
ఫీచర్లు,సేఫ్టీ
ఫీచర్ల పరంగా ఈ రెండు కార్లు ఒకదానికొకటి ఏమాత్రం తీసిపోవు. రెండింటిలోనూ 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), వైర్‌లెస్ కనెక్టివిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ప్రయాణీకులకు రక్షణ కల్పిస్తాయి. కేవలం లోపల ఇంటీరియర్ కలర్ థీమ్, ఫ్రంట్ గ్రిల్ డిజైన్ మాత్రమే స్వల్పంగా మారుతుంది.
వారంటీ, సర్వీస్
గ్లాంజా ధర కొంచెం ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం టయోటా ఇచ్చే వారంటీ, సర్వీస్ క్వాలిటీ. టయోటా సాధారణంగా 3 ఏళ్లు లేదా 1,00,000 కి.మీల వారంటీని ప్రామాణికంగా అందిస్తుంది, ఇది మారుతి కంటే మెరుగైనది. అలాగే టయోటా సర్వీస్ సెంటర్లలో కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ చాలా ప్రీమియంగా ఉంటుంది. మరోవైపు మారుతి సుజుకికి దేశవ్యాప్తంగా అపారమైన సర్వీస్ నెట్‌వర్క్ ఉంది. గల్లీ గల్లీలోనూ మారుతి సర్వీస్ సెంటర్లు దొరుకుతాయి. కాబట్టి మీకు తక్కువ ధర కావాలంటే బాలెనో, ఎక్కువ వారంటీ, ప్రీమియం సర్వీస్ కావాలంటే గ్లాంజా వైపు వెళ్లవచ్చు.

