Maruti : పండుగ డిమాండ్ మాయ.. సెప్టెంబర్‌లో రికార్డు సృష్టించిన మారుతి
సెప్టెంబర్‌లో రికార్డు సృష్టించిన మారుతి

Maruti : భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి పండుగ సీజన్‌కు ముందు భారీగా కార్లను తయారు చేసి రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 2025 నెలలో కంపెనీ మొత్తం 2,01,915 యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇది గత సంవత్సరం సెప్టెంబర్ (1,59,743 యూనిట్లు) కంటే ఏకంగా 26 శాతం ఎక్కువ. పండుగ డిమాండ్‌కు, కస్టమర్ల బుకింగ్‌లకు సరిపడా కార్లను సిద్ధం చేయడానికి కంపెనీ తన ఉత్పత్తి వేగాన్ని బాగా పెంచింది.
మారుతి సుజుకిలో అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లు అయిన బలెనో, సెలెరియో, డిజైర్, స్విఫ్ట్ వంటి కాంపాక్ట్ కార్లకు డిమాండ్ నిలకడగా ఉంది. ఈ సెగ్మెంట్‌లో కంపెనీ ఏకంగా 93,301 యూనిట్లను ఉత్పత్తి చేసింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఇది 68,413 యూనిట్లు మాత్రమే. ఈ గణాంకాలు చూస్తుంటే, భారతీయ కస్టమర్లు ఇప్పటికీ హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ సెడాన్ కార్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారని స్పష్టమవుతోంది.
ఇటీవలి కాలంలో ఎస్‌యూవీ, ఎంయూవీ సెగ్మెంట్లపై కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇది మారుతి ఉత్పత్తి గణాంకాల్లో కూడా కనిపించింది. బ్రెజా, ఎర్టిగా, ఫ్రాంక్స్ వంటి ఈ విభాగపు కార్ల ఉత్పత్తి 27 శాతం పెరిగి 79,496 యూనిట్లకు చేరుకుంది. గత ఏడాది ఇది 62,752 యూనిట్లు మాత్రమే. మారుతి బడ్జెట్ కార్లు అయిన ఆల్టో, ఎస్-ప్రెస్సో ఉత్పత్తి ఈసారి 12,318 యూనిట్లుగా నమోదైంది (గత సంవత్సరం 12,155 యూనిట్లు). అలాగే, ఈకో వ్యాన్ ఉత్పత్తి కూడా 13,201 యూనిట్లకు పెరిగింది (గత సంవత్సరం 11,702 యూనిట్లు). తేలికపాటి వాణిజ్య వాహనం అయిన సూపర్ క్యారీ ఉత్పత్తి సైతం 3,599 యూనిట్లకు పెరిగి మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
ఈ నెల ఉత్పత్తిలో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కంపెనీ తన ప్రీమియం సెడాన్ అయిన సియాజ్ మోడల్‌ను ఒక్కటి కూడా తయారు చేయలేదు. గత సంవత్సరం ఇదే నెలలో సియాజ్ కార్లు 1,687 యూనిట్లు ఉత్పత్తి అయ్యాయి. మారుతి సుజుకి ఇటీవల విడుదల చేసిన సేల్స్ రిపోర్ట్ ప్రకారం, సెప్టెంబర్ 2025లో మొత్తం 1,89,665 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అయితే, దేశీయ ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు మాత్రం 8 శాతం తగ్గి 1,32,820 యూనిట్లకు చేరుకున్నాయి. కంపెనీ దీనిపై స్పందిస్తూ.. ఈ స్వల్ప తగ్గుదల స్టాక్ మేనేజ్‌మెంట్, పండుగ సీజన్‌కు ముందు స్టాక్‌ను సిద్ధం చేయడం వల్ల వచ్చిందని తెలిపింది. అంటే, కంపెనీ ఈ పండుగల కోసం భారీ సంఖ్యలో కార్లను సిద్ధం చేసిందని అర్థం.
