Maruti Brezza : మారుతి నుంచి నయా బ్రెజా.. అదిరిపోయే ఫీచర్లతో టెస్టింగ్‌లో అడ్డంగా దొరికిపోయిన ఎస్యూవీ
అదిరిపోయే ఫీచర్లతో టెస్టింగ్‌లో అడ్డంగా దొరికిపోయిన ఎస్యూవీ

Maruti Brezza : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన మారుతి సుజుకి బ్రెజా సరికొత్త హంగులతో మళ్ళీ వస్తోంది. తాజాగా బ్రెజా ఫేస్‌లిఫ్ట్ మోడల్ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. కారును పూర్తిగా కవర్ చేసినప్పటికీ, అందులో జరుగుతున్న కీలక మార్పులు ఇప్పుడు వాహన ప్రియులను ఖుషీ చేస్తున్నాయి. టెక్నాలజీ పరంగా, సౌకర్యాల విషయంలో ఈసారి మారుతి అదిరిపోయే అప్‌డేట్స్ ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. కొత్త బ్రెజా కేబిన్ లోపల ప్రధాన ఆకర్షణ దాని భారీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ప్రస్తుతం ఉన్న మోడల్‌లో 9 అంగుళాల స్క్రీన్ ఉండగా, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఏకంగా 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ను అమర్చబోతున్నారు. దీంతో పాటు సరికొత్త యూజర్ ఇంటర్‌ఫేస్ రాబోతోంది, ఇది చాలా స్మూత్ గా మరియు ఫోన్ వాడుతున్నంత సులభంగా ఉంటుంది. సైడ్ మిర్రర్స్ కింద కనిపిస్తున్న సెన్సర్లను చూస్తుంటే, ఈ కారులో 360-డిగ్రీ కెమెరా సెటప్ కూడా ఉండబోతోందని కచ్చితంగా చెప్పవచ్చు. దీనివల్ల ఇరుకైన సందుల్లో కారును పార్కింగ్ చేయడం చాలా సులభం కానుంది.
బయటి డిజైన్ విషయానికి వస్తే.. మారుతి సుజుకి భారీ మార్పులేమీ చేయకపోయినా, కారును మరింత మోడ్రన్ గా మార్చే ప్రయత్నం చేస్తోంది. కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్, మార్పులు చేసిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు కారుకు సరికొత్త లుక్ ఇస్తాయి. హెడ్ లైట్లు, టెయిల్ లైట్ల లోపల ఉండే గ్రాఫిక్స్ లో కూడా స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ మార్పులన్నీ బ్రెజాను తన ప్రత్యర్థులైన నెక్సాన్, ఎక్స్ యూవీ 3XO, సోనెట్ కంటే మెరుగ్గా నిలబెడతాయి.
ఇంజిన్, పర్ఫార్మెన్స్
బ్రెజా ఫేస్‌లిఫ్ట్‌లో ఇంజిన్ పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. నమ్మకమైన 1.5-లీటర్ K15C పెట్రోల్ ఇంజిన్ నే ఇందులోనూ కొనసాగించనున్నారు. ఇది మూడు వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది.
* నార్మల్ పెట్రోల్: 99bhp పవర్, 137Nm టార్క్‌తో వస్తుంది.
* సీఎన్‌జీ వెర్షన్: 87bhp పవర్ తో మైలేజీ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్.
* మైల్డ్-హైబ్రిడ్: 102bhp పవర్ తో మెరుగైన మైలేజీ, పికప్ ఇస్తుంది.
విశేషమేమిటంటే, ఈసారి 6-స్పీడ్ మాన్యువల్ (6MT) గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది, దీనివల్ల హైవేలపై డ్రైవింగ్ మరింత హాయిగా ఉంటుంది.
లాంచ్ ఎప్పుడు?
ప్రస్తుతానికి మారుతి సుజుకి నుంచి అధికారిక లాంచ్ డేట్ ప్రకటించబడలేదు. కానీ ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ చేస్తూ కనిపించడంతో, రాబోయే పండుగ సీజన్ నాటికి లేదా 2026 ఆఖరులోపు ఈ సరికొత్త బ్రెజాను మార్కెట్లోకి తెచ్చే అవకాశం ఉంది. పాత బ్రెజా కంటే దీని ధర రూ.30,000 నుంచి రూ.50,000 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.

