Brezza 2026 : టాటా నెక్సాన్‌కు కొత్త టెన్షన్.. ADAS, CNG అప్‌డేట్‌తో రాబోతున్న కొత్త మారుతి బ్రెజ్జా
ADAS, CNG అప్‌డేట్‌తో రాబోతున్న కొత్త మారుతి బ్రెజ్జా

Brezza 2026 : భారతీయ మార్కెట్‌లో సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో బాగా అమ్ముడవుతున్న మారుతి బ్రెజ్జా త్వరలో కొత్త అప్‌డేట్‌తో మార్కెట్‌లోకి రాబోతోంది. ఇటీవల ఈ కారును టెస్టింగ్ చేస్తున్నప్పుడు చూశారు. దీంతో ఇది 2026లో రాబోయే ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కొత్త అప్‌డేట్‌లో అనేక కీలక మార్పులు, సేఫ్టీ ఫీచర్లు రాబోతున్నాయి. ముఖ్యంగా టాటా నెక్సాన్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి మారుతి ఈసారి సేఫ్టీ, ఫీచర్లపై ఎక్కువ దృష్టి పెట్టింది.
టెస్టింగ్ సమయంలో కనిపించిన ప్రొటోటైప్ వెనుక విండ్‌షీల్డ్‌పై CNG స్టిక్కర్ ఉండడం గమనించదగిన విషయం. అంటే కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ CNG ఆప్షన్‌లో కూడా రానుంది. మీడియా రిపోర్టుల ప్రకారం.. ఈ కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో ఇటీవల మారుతి విక్టోరిస్ మోడల్‌లో ఇచ్చినట్లుగా అండర్‌బాడీ CNG ట్యాంక్ లేఅవుట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సెటప్ వల్ల CNG ట్యాంక్ సాధారణంగా ఆక్రమించే బూట్ స్పేస్ పూర్తిగా ఖాళీ అవుతుంది. అయితే ఈ మార్పు కోసం ఫ్యూయల్ లైన్, ఎగ్జాస్ట్, ప్లాట్‌ఫామ్ రైల్స్‌లో కొన్ని మెకానికల్ అడ్జస్ట్‌మెంట్లు చేయాల్సి ఉంటుంది.
సేఫ్టీ విషయంలో మారుతి బ్రెజ్జా 2026 ఫేస్‌లిఫ్ట్‌లో అతిపెద్ద అప్‌గ్రేడ్ రాబోతోంది. ఈ కారులో లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) సూట్ లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ABS విత్ EBD, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వెనుక పార్కింగ్ సెన్సార్ల వంటి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు యధావిధిగా కొనసాగుతాయి.
కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్ పరంగా చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు. కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్, మారుతి విక్టోరిస్ నుంచి తీసుకున్న కొద్దిగా మారిన LED టెయిల్ ల్యాంప్‌లు వంటివి బయట కనిపిస్తాయి. ఇంటీరియర్ అప్‌డేట్ చేసిన ట్రిమ్‌లు, అపోల్స్టరీ (సీట్ కవర్ మెటీరియల్), కొత్త క్యాబిన్ థీమ్, విక్టోరిస్ తరహాలో ఉన్న కొత్త స్టీరింగ్ వీల్ వచ్చే అవకాశం ఉంది.
ఇంజిన్, ట్రాన్స్‌మిషన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. 2026 మారుతి బ్రెజ్జాలో కూడా ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతుంది. ఇది 103 bhp పవర్, 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా మారవు – 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉంటాయి. CNG వేరియంట్‌లో పవర్ అవుట్‌పుట్‌లో కొద్దిగా తగ్గుదల ఉంటుంది.

