Maruti Brezza Vs Mahindra XUV 3XO : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో సబ్‌కాంపాక్ట్ SUVల విభాగంలో పోటీ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఇటీవలే మార్కెట్లోకి కొత్త అప్‌డేట్‌లతో వచ్చిన మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్, ఫీచర్ల పవర్‌హౌస్‌గా పేరు తెచ్చుకున్న మహీంద్రా XUV 3XOల మధ్య ఇప్పుడు గట్టి పోరు నడుస్తోంది. బ్రెజ్జా తన నమ్మకమైన పెర్ఫార్మెన్స్, సిఎన్‌జి ఆప్షన్, రీసేల్ వ్యాల్యూతో ప్రజాదరణ పొందుతుంటే, మహీంద్రా XUV 3XO మాత్రం ఎక్కువ పవర్, అధునాతన సేఫ్టీ టెక్నాలజీ, భారీ డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటే మంచిదో వివరంగా తెలుసుకుందాం.

ధర, సైజులో తేడాలు

ధరల విషయానికి వస్తే.. మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.4 లక్షలుగా ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ. 13.71 లక్షల వరకు ఉంది. మరోవైపు మహీంద్రా XUV 3XO ప్రారంభ ధర రూ. 7.8 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌కి రూ. 15.04 లక్షల వరకు వెళ్తుంది. పరిమాణం (డైమెన్షన్స్) పరంగా చూస్తే, బ్రెజ్జా కారు XUV 3XO కంటే 5 మిమీ ఎక్కువ పొడవు, 38 మిమీ ఎక్కువ ఎత్తు కలిగి ఉంటుంది. అయితే మహీంద్రా XUV 3XO మాత్రం బ్రెజ్జా కంటే 31 మిమీ ఎక్కువ వెడల్పు, 100 మిమీ ఎక్కువ వీల్‌బేస్ కలిగి ఉంది. ఈ పెరిగిన వీల్‌బేస్ వల్ల XUV 3XO లోపల కూర్చునే ప్రయాణికులకు మెరుగైన లెగ్‌రూమ్, షోల్డర్ రూమ్ లభిస్తుంది.

ఇంజిన్ ఆప్షన్లు.. పవర్ వర్సెస్ మైలేజ్

ఈ రెండు కార్ల ఇంజిన్ ఎంపికలు వేర్వేరు కస్టమర్ల అవసరాలను తీరుస్తాయి. మారుతి బ్రెజ్జాలో మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 103 పిఎస్ పవర్ ఇచ్చే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, తక్కువ ఖర్చుతో ప్రయాణించే వారి కోసం 88 పిఎస్ పవర్ ఇచ్చే సీఎన్‌జీ ఆప్షన్, కొత్తగా పరిచయం చేసిన 110 పిఎస్ పవర్ ఇచ్చే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, మహీంద్రా XUV 3XO పెర్ఫార్మెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో 112 పిఎస్ పవర్ ఇచ్చే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 130 పిఎస్, 230 ఎన్ఎమ్ టాప్ టార్క్ ఇచ్చే 1.2-లీటర్ టి-జిడిఐ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌లతో పాటు, మైలేజ్, పవర్ కోరుకునే వారి కోసం 117 పిఎస్ పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ ఇచ్చే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది.

ఫీచర్లు, కేబిన్ అనుభూతి

క్యాబిన్ ఫీచర్ల పరంగా రెండూ ఆధునిక వసతులతో నిండి ఉన్నాయి. రెండు కార్లలోనూ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటో-ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, పుష్-బటన్ స్టార్ట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా వంటి సౌకర్యాలు ఉన్నాయి. మహీంద్రా XUV 3XO లో భారీ 12.25-ఇంచుల టచ్‌స్క్రీన్, 17-ఇంచుల వీల్స్, రాయల్ లుక్ ఇచ్చే పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించారు. దీనికి పోటీగా బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో 10.1-ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్, సింగిల్ పేన్ సన్ రూఫ్, 16-ఇంచుల వీల్స్‌తో పాటు క్లాసీ హెడ్-అప్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్యాడిల్ షిఫ్టర్లను పొందుపరిచారు.

సేఫ్టీ టెక్నాలజీ, ఏది బెస్ట్?

సేఫ్టీ విషయంలో రెండు సంస్థలూ పెద్దపీట వేశాయి. మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 5-స్టార్ భరత్ NCAP సేఫ్టీ రేటింగ్ మరియు ప్రాథమిక లెవెల్-1 ADAS ఫీచర్లు ఉన్నాయి. కాగా మహీంద్రా XUV 3XOలో మరింత పవర్ఫుల్ లెవెల్-2 ADAS సూట్ అందుబాటులో ఉంది. మొత్తానికి, మీకు తక్కువ రన్నింగ్ కాస్ట్ ఇచ్చే సీఎన్‌జీ ఆప్షన్, ఎక్కువ మైలేజ్, నమ్మకమైన సర్వీస్ నెట్‌వర్క్ కావాలనుకుంటే మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ సరైన ఎంపిక. అలా కాకుండా పవర్ ఫుల్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే వారికి మహీంద్రా XUV 3XO పర్ఫెక్ట్ గా సరిపోతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story