Maruti Dzire : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీల హవా నడుస్తున్నప్పటికీ, సెడాన్ కార్ల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. జూన్ 2026లో భారత మార్కెట్లో సెడాన్ కార్ల విక్రయాలు గతేడాది జూన్‌తో పోలిస్తే 10 శాతం పెరిగి మొత్తం 31,183 యూనిట్లకు చేరాయి. అయితే, మే 2026 విక్రయాలతో (37,055 యూనిట్లు) పోలిస్తే మాత్రం విక్రయాలు దాదాపు 16 శాతం మేర తగ్గాయి. ఇక ఏప్రిల్-జూన్ త్రైమాసికం (Q2) ఫలితాలను పరిశీలిస్తే, మొత్తంగా 1,03,456 సెడాన్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడైన 87,868 యూనిట్లతో పోలిస్తే ఇది 18 శాతం మంచి పురోగతిని సూచిస్తోంది.

నంబర్ 1 స్థానంలో మారుతి సుజుకి డిజైర్

సెడాన్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి డిజైర్ తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. జూన్ 2026లో ఏకంగా 17,899 యూనిట్ల విక్రయాలతో నంబర్ 1 స్థానంలో నిలిచింది. గతేడాది జూన్‌తో పోలిస్తే డిజైర్ సేల్స్ 15.6 శాతం పెరిగాయి. దేశంలో అమ్ముడైన మొత్తం సెడాన్ కార్లలో ఒక్క డిజైర్ వాటానే 57.4 శాతం కావడం విశేషం. మే నెలలో అమ్ముడైన 24,546 యూనిట్లతో పోలిస్తే విక్రయాలు కాస్త తగ్గినప్పటికీ, తన సమీప ప్రత్యర్థి కంటే మూడు రెట్లు ఎక్కువ సేల్స్‌తో దూసుకెళ్లింది.

రేసులో నిలిచిన ఆరా, అమెజ్

రెండో స్థానంలో హ్యుందాయ్ ఆరా నిలిచింది. జూన్ నెలలో ఈ కారు 5,977 యూనిట్లు అమ్ముడైంది. వార్షిక ప్రాతిపదికన 10.42 శాతం, నెలవారీగా 17.73 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక మూడో స్థానంలో హోండా అమెజ్ 2,937 యూనిట్ల విక్రయాలతో నిలిచింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. డిజైర్, ఆరా, అమెజ్ ఈ మూడు సబ్‌-4 మీటర్ సెడాన్ కార్లు కలిపి మొత్తం సెడాన్ విక్రయాల్లో ఏకంగా 86 శాతం వాటాను దక్కించుకున్నాయి.

మిడ్-సైజ్ సెడాన్లలో గట్టి పోటీ

మిడ్-సైజ్ సెడాన్ విభాగానికి వస్తే ఫోక్స్‌వాగన్ వర్టస్ 1,195 యూనిట్ల విక్రయాలతో టాప్‌లో నిలిచింది. దీనికి గట్టి పోటీ ఇస్తూ స్కోడా స్లావియా 1,083 యూనిట్లతో సరిగ్గా వెనుకే నిలిచింది. స్లావియా సేల్స్ ఏకంగా 20.87 శాతం వృద్ధి చెందడం విశేషం. వర్టస్ మరియు స్లావియాల మధ్య వ్యత్యాసం కేవలం 112 యూనిట్లు మాత్రమే ఉండటంతో ఈ రెండింటి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

సిటీ, వెర్నా, టిగోర్ పరిస్థితి ఏమిటి?

మిగతా ప్రీమియం మరియు కాంపాక్ట్ సెడాన్లలో హోండా సిటీ 745 యూనిట్లతో పర్వాలేదనిపించింది. టాటా టిగోర్, టిగోర్ ఈవీ కలిపి 602 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఒకప్పుడు టాప్‌లో ఉండే హ్యుందాయ్ వెర్నా విక్రయాలు ఏకంగా 32 శాతం తగ్గి 554 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇక లగ్జరీ విభాగంలో టోయోటా కామ్రీ 191 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story