Maruti Dzire : డిజైర్ ధాటికి ప్రత్యర్థులు ఖల్లాస్.. అమ్మకాల రేసులో తిరుగులేని రారాజు
అమ్మకాల రేసులో తిరుగులేని రారాజు

Maruti Dzire : భారత ఆటోమొబైల్ రంగానికి మార్చి 2026 నెల ఒక పండగలా మారింది. కార్ల అమ్మకాలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ముందు దాదాపు అన్ని కంపెనీలు తమ సేల్స్ రికార్డులను తిరగరాశాయి. అయితే ఈ రేసులో ఎవరూ ఊహించని విధంగా మారుతి సుజుకి డిజైర్, టాటా నెక్సాన్‌ను వెనక్కి నెట్టి మళ్ళీ సింహాసనాన్ని దక్కించుకుంది.
అమ్మకాల సునామీ.. 21 శాతం గ్రోత్
ఈ ఏడాది మార్చి నెలలో ఫోర్ వీలర్ అమ్మకాలు కళ్లు చెదిరే స్థాయిలో నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 21.48 శాతం వృద్ధితో మొత్తం 4.4 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. ఇందులో టాప్ 10 కార్ల వాటానే 1,76,586 యూనిట్లు ఉండటం విశేషం. సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్లు మరియు ఎస్‌యూవీల మధ్య గట్టి పోటీ జరిగినప్పటికీ, జనాలు మాత్రం మారుతి డిజైర్ వైపు మొగ్గు చూపారు.
డిజైర్ మళ్ళీ నంబర్ వన్
ఫిబ్రవరి 2026లో జిఎస్‌టి తగ్గింపు పుణ్యమా అని టాటా నెక్సాన్ అగ్రస్థానంలో నిలిచింది. కానీ మార్చి వచ్చేసరికి సీన్ మారిపోయింది. మారుతి డిజైర్‌ను ఏకంగా 21,224 మంది కొనుగోలు చేశారు. గతేడాదితో పోలిస్తే ఇది 37.28 శాతం పెరుగుదల. ఇక రెండో స్థానంలో టాటా పంచ్ 20,977 యూనిట్లతో గట్టి పోటీ ఇచ్చింది. నెక్సాన్ దూకుడుకు డిజైర్ బ్రేకులు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
మారుతి చరిత్రలోనే తొలి 5-స్టార్ సేఫ్టీ కారు
ఒకప్పుడు మారుతి కార్లు అంటే సేఫ్టీ ఉండదు అనే విమర్శ ఉండేది. కానీ 2024 నవంబర్‌లో వచ్చిన కొత్త డిజైర్ ఆ విమర్శలన్నింటినీ తుడిచేసింది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ సాధించిన మొట్టమొదటి మారుతి కారుగా ఇది రికార్డు సృష్టించింది. సన్‌రూఫ్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా తోడవడంతో మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ సెడాన్‌గా మారిపోయింది.
ఫీచర్లు అదుర్స్.. మైలేజీ అదిరింది
కొత్త డిజైర్‌లో 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇక మైలేజీ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్ లీటరుకు 24.79 కి.మీ నుంచి 25.71 కి.మీ వరకు ఇస్తుండగా, సిఎన్‌జి వెర్షన్ ఏకంగా కేజీకి 33.73 కి.మీ మైలేజీని అందిస్తోంది. జేబుకు చిల్లు పడకుండా జర్నీ చేయాలనుకునే వారికి ఇదే బెస్ట్ ఆప్షన్.
ధర ఎంత?
మారుతి డిజైర్ బేస్ మోడల్ LXI ధర సుమారు రూ.6.26 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. టాప్ ఎండ్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ.10.62 లక్షల వరకు ఉంటుంది. సిఎన్‌జి వెర్షన్లు రూ.9.19 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, అది కూడా 5-స్టార్ సేఫ్టీతో లభిస్తుండటమే డిజైర్ సక్సెస్ సీక్రెట్.

