ఏ కారు కొంటే లాభం?

MG Windsor EV vs Maruti e-Vitara : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, ఎట్టకేలకు తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ-విటారాను లాంచ్ చేయడం ద్వారా ఈవీ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న ఎంజీ విండ్సర్ ఈవీకి ఇది గట్టి పోటీ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మీరు కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే సందేహం కలగడం సహజం. ధర, రేంజ్, ఫీచర్ల పరంగా ఈ రెండు కార్ల మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఇక్కడ ఉన్నాయి.

ఈ రెండు కార్లలో ఉన్న అతిపెద్ద సమానత్వం ఏమిటంటే.. రెండూ కూడా బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ మోడల్‌లో లభిస్తాయి. ఈ పద్ధతిలో కారును తక్కువ ధరకే కొని, బ్యాటరీ వాడిన కిలోమీటర్లను బట్టి అద్దె కడితే సరిపోతుంది. మారుతి ఈ-విటారా బాస్ మోడల్ ధర రూ.10.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది, దీనికి కిలోమీటరుకు రూ.3.99 బ్యాటరీ అద్దె చెల్లించాలి. మరోవైపు ఎంజీ విండ్సర్ ఈవీ బాస్ మోడల్ రూ.9.99 లక్షలకే లభిస్తుంది. దీని బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ.3.50 మాత్రమే. అంటే ప్రారంభ ధర, రన్నింగ్ కాస్ట్ పరంగా ఎంజీ విండ్సర్ స్వల్పంగా ముందంజలో ఉంది.

బ్యాటరీ, రేంజ్ విషయానికి వస్తే మారుతి ఈ-విటారా సంచలనం సృష్టిస్తోంది. ఇది 49 kWh, 61 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. పెద్ద బ్యాటరీతో ఇది ఏకంగా 543 కిలోమీటర్ల రేంజ్ (డ్రైవింగ్ రేంజ్) ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. అదే సమయంలో ఎంజీ విండ్సర్ ఈవీ 38 kWh, 52.9 kWh బ్యాటరీలతో గరిష్టంగా 449 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అంటే లాంగ్ డ్రైవ్స్ ఎక్కువగా వెళ్లే వారికి మారుతి ఈ-విటారా ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఫీచర్ల పరంగా చూస్తే రెండు కార్లూ అదుర్స్ అనిపిస్తాయి. ఎంజీ విండ్సర్ ఈవీలో ఏకంగా 15.6 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, వెహికల్-టు-లోడ్ (V2L) ఛార్జింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. దీని ద్వారా మీరు కారు బ్యాటరీతో ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా వాడుకోవచ్చు. ఇక మారుతి ఈ-విటారాలో డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, 10.25 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, హార్మన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. సేఫ్టీ కోసం రెండు కార్ల టాప్ వేరియంట్లలో లెవల్-2 ADAS టెక్నాలజీని అందించారు, ఇది ప్రమాదాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

మీకు తక్కువ ధరలో ఎక్కువ లగ్జరీ ఫీచర్లు, వినూత్నమైన డిజైన్ కావాలనుకుంటే ఎంజీ విండ్సర్ ఈవీ ఉత్తమం. అలా కాకుండా అత్యధిక రేంజ్, మారుతిపై ఉన్న నమ్మకం, విశాలమైన సర్వీస్ నెట్‌వర్క్ కావాలనుకుంటే మారుతి ఈ-విటారాను ఎంచుకోవచ్చు. భారత్ ఎన్‌క్యాప్ నుంచి 5-స్టార్ రేటింగ్ సాధించడం ఈ-విటారాకు అదనపు బలాన్ని ఇస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story