Maruti Fronx: భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి మరోసారి తన సత్తా చాటింది. కంపెనీ నుంచి వచ్చిన కాంపాక్ట్ ఎస్‌యూవీ మారుతి ఫ్రాంక్స్ కస్టమర్ల మనసు గెలుచుకుని సేల్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. 2023 ఏప్రిల్‌లో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కారు, లాంచ్ అయిన కేవలం మూడున్నరేళ్లలోనే దేశీయంగా 6 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటేసింది. తక్కువ ధరలో స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్లు ఉండటంతో జనం ఈ కారును ఎగబడి కొంటున్నారు.

రాకెట్ వేగంతో దూసుకెళ్లిన అమ్మకాలు

మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి మారుతి ఫ్రాంక్స్ వెనుదిరిగి చూసుకోలేదు. లాంచ్ అయిన కేవలం 10 నెలల్లోనే తొలి లక్ష యూనిట్ల అమ్మకాలను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత 17 నెలల్లో 2 లక్షలు, 23 నెలల్లో 3 లక్షలు, 33 నెలల్లో 4 లక్షల మార్కును సులభంగా దాటేసింది. 2026 మే నెల ప్రారంభంలో 5 లక్షల సేల్స్ పూర్తి చేసుకున్న ఈ కారు, ఇప్పుడు ఏకంగా 6 లక్షల ఇళ్లకు చేరింది. అంటే చివరి లక్ష కార్లు కేవలం 5 నెలల వ్యవధిలోనే అమ్ముడయ్యాయంటే ఈ కారుకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

సొంత అన్న బాలెనోకే ఝలక్ ఇచ్చిన ఫ్రాంక్స్

మారుతి నెక్సా షోరూమ్‌లలో ఇప్పటివరకు రారాజుగా వెలుగొందిన మారుతి బాలెనోకు ఫ్రాంక్స్ గట్టి షాక్ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ - అక్టోబర్ 2026 మధ్య) ఫ్రాంక్స్ ఏకంగా 1,30,149 యూనిట్లు అమ్ముడైంది. గతేడాది ఇదే సమయంలో అమ్ముడైన 93,808 కార్లతో పోలిస్తే ఇది 39 శాతం అధికం. ఇదే సమయంలో బాలెనో 1,29,488 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. దీనితో బాలెనోను 661 కార్ల తేడాతో వెనక్కి నెట్టి నెక్సా లైనప్‌లో నంబర్ వన్ కారుగా ఫ్రాంక్స్ అవతరించింది. గతేడాది (2025-26) బాలెనో మొదటి స్థానంలో ఉండగా, ఫ్రాంక్స్ రెండో స్థానంలో నిలిచింది.

విదేశాల్లోనూ తగ్గేదేలే..

కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మారుతి ఫ్రాంక్స్‌కు విపరీతమైన డిమాండ్ నెలకొంది. కంపెనీ ఇప్పటివరకు 2.20 లక్షలకు పైగా ఫ్రాంక్స్ కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది. 2026 అక్టోబర్ నెలలో ఏకంగా 20,014 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఒకే నెలలో 20 వేల మార్కును దాటడం ఇది నాలుగోసారి. ప్రస్తుత జోరు చూస్తుంటే 2026-27 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ కారు అమ్మకాలు 2.25 లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉంది. అదే జరిగితే ఒకే ఆర్థిక సంవత్సరంలో 2 లక్షలకు పైగా అమ్ముడైన కారుగా ఫ్రాంక్స్ కొత్త చరిత్ర రాస్తుంది.

ధర, ఇంజిన్ ఆప్షన్లు ఇవే..

మారుతి ఫ్రాంక్స్ ప్రారంభ ధర రూ. 6.90 లక్షల నుంచి టాప్ మోడల్ రూ. 11.89 లక్షల వరకు ఉంది. ఇది సిగ్మా, డెల్టా, డెల్టా+, జెటా, ఆల్ఫా అనే ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ (90hp), 1.2-లీటర్ సీఎన్‌జీ ఇంజిన్ (77.5hp), 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (100hp) ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ మోడల్‌లో 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ లభిస్తాయి. సీఎన్‌జీలో మాన్యువల్ గేర్‌బాక్స్ ఉండగా, టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది.

Next Story