జనం చూపు మొత్తం దీనిపైనే

Maruti Fronx : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు ఈ సెగ్మెంట్‌లో రారాజుగా వెలిగిన టాటా పంచ్‌కు మారుతి సుజుకి ఫ్రాంక్స్ గట్టి షాక్ ఇచ్చింది. గత నెల అంటే డిసెంబర్ 2025 సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే.. ఫ్రాంక్స్ అమ్మకాలు ఊహించని రీతిలో పెరిగాయి. కేవలం టాటా పంచ్‌నే కాకుండా సెగ్మెంట్‌లోని ఇతర దిగ్గజ కార్లను కూడా వెనక్కి నెట్టి దేశంలోనే రెండో అత్యధిక విక్రయాలు సాధించిన కారుగా ఫ్రాంక్స్ నిలిచింది. రూ. 6.85 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ కారు ఇప్పుడు మధ్యతరగతి ప్రజల హాట్ ఫేవరెట్‌గా మారింది.

గత నెలలో అమ్మకాల లెక్కలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. డిసెంబర్ 2025లో మారుతి ఫ్రాంక్స్ ఏకంగా 20,706 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. అదే సమయంలో టాటా పంచ్ 15,980 యూనిట్లకే పరిమితమైంది. అంటే ఈ రెండు కార్ల మధ్య సుమారు 4,726 యూనిట్ల భారీ వ్యత్యాసం ఉంది. మరీ ముఖ్యంగా, ఏడాది ప్రాతిపదికన ఫ్రాంక్స్ ఏకంగా 93 శాతం వృద్ధిని సాధించింది. అంటే గత ఏడాదితో పోలిస్తే దీని అమ్మకాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. అదే సమయంలో టాటా పంచ్ కేవలం 6 శాతం వృద్ధితోనే సరిపెట్టుకుంది.

ఫ్రాంక్స్ ఇంతటి విజయం సాధించడానికి దాని పెర్ఫార్మెన్స్ ప్రధాన కారణం. ఇందులో 1.0-లీటర్ టర్బో బూస్టర్ జెట్ ఇంజిన్ ఉంది, ఇది కేవలం 5.3 సెకన్లలోనే 0 నుండి 60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అలాగే 1.2-లీటర్ K-సిరీస్ ఇంజిన్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది లీటరుకు 22.89 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ప్యాడిల్ షిఫ్టర్స్ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సరదాగా మారుస్తాయి. దీని పొడవు 3995mm, వీల్‌బేస్ 2520mm ఉండటం వల్ల లోపల స్థలం కూడా ధారాళంగా ఉంటుంది.

తక్కువ ధరకే వస్తున్నా, ఫ్రాంక్స్‌లో ఫీచర్ల విషయంలో మారుతి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇందులో 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. వెనుక ప్రయాణికుల కోసం ఏసీ వెంట్స్, ఫాస్ట్ యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్లు కూడా ఇచ్చారు. 308 లీటర్ల బూట్ స్పేస్ ఉండటం వల్ల ఫ్యామిలీతో ట్రిప్పులకు వెళ్ళడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

మారుతి కార్లలో సేఫ్టీ ఉండదనే అపవాదును ఫ్రాంక్స్ చెరిపివేస్తోంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు 360-డిగ్రీ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయి. ఏబీఎస్ విత్ ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు బేస్ వేరియంట్ నుండే అందుబాటులో ఉన్నాయి. రూ.6.85 లక్షల నుండి రూ.11.98 లక్షల బడ్జెట్‌లో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్ వంటి కార్లకు ఫ్రాంక్స్ ఇప్పుడు సింహస్వప్నంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story