Maruti Jimny : మన దేశంలో అట్టర్ ప్లాప్.. విదేశాల్లో సూపర్ హిట్.. ఆ కారు కావాలంటే 4ఏళ్లు ఆగాల్సిందే
విదేశాల్లో సూపర్ హిట్.. ఆ కారు కావాలంటే 4ఏళ్లు ఆగాల్సిందే

Maruti Jimny : భారత మార్కెట్‌లో మారుతి సుజుకి 5-డోర్ జిమ్నీ ఆశించినంత విజయం సాధించలేకపోయినా, జపాన్‌లో మాత్రం ఇది జిమ్నీ నొమాడే పేరుతో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయిన కేవలం నాలుగు రోజుల్లోనే 50,000 బుకింగ్‌లు సాధించింది. డిమాండ్ విపరీతంగా పెరగడంతో జపాన్‌లో జిమ్నీ కోసం నాలుగేళ్ల దాకా వెయిటింగ్ పీరియడ్ ఏర్పడింది. దీని కారణంగా తాత్కాలికంగా బుకింగ్‌లను కంపెనీ నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ బుకింగ్‌లు మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది.
భారత మార్కెట్‌లో పెద్దగా ప్రభావం చూపని మారుతి సుజుకి 5-డోర్ జిమ్నీ, దాని మాతృదేశం అయిన జపాన్‌లో మాత్రం బంపర్ హిట్‌గా మారింది. ఈ ఎస్‌యూవీని జపాన్‌లో జిమ్నీ నొమాడే పేరుతో విక్రయిస్తున్నారు. వినియోగదారుల నిరీక్షణకు తెరదించుతూ, సుజుకి కంపెనీ జిమ్నీ బుకింగ్‌లను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. జిమ్నీ నొమాడే బుకింగ్‌లు జనవరి 30, 2026 నుంచి తిరిగి ప్రారంభమవుతాయి. గత ఏడాది మొదటిసారి బుకింగ్స్ మొదలైన తేదీ కూడా ఇదే కావడం విశేషం.
ఈ ఏడాది జూలైలో జిమ్నీ నొమాడే డెలివరీ తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే, ఆగస్టు చివరి నాటికి ఈ సమస్యను పరిష్కరించి, డెలివరీలను తిరిగి ప్రారంభించారు. జిమ్నీ 5-డోర్ మోడల్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నప్పటికీ, దీని ఉత్పత్తి మొత్తం భారతదేశంలోని ఒకే ప్లాంట్‌లో జరుగుతోంది. జిమ్నీ 5-డోర్ మోడల్‌ను భారతదేశంలోని మారుతి సుజుకి గురుగ్రామ్ (హర్యానా) ప్లాంట్‌లో మాత్రమే తయారు చేస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా అయిన ఈ ఎస్‌యూవీని జపాన్‌తో పాటు మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, చిలీ వంటి అనేక ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.
ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా సుజుకి కంపెనీ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. జిమ్నీని లాంచ్ చేసినప్పుడు నెలవారీ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 1,200 యూనిట్లుగా ఉండేది. జూలై 2025 నాటికి ఇది సుమారు 3,300 యూనిట్లుకు పెరిగింది. సెప్టెంబర్ నెలలో షిప్‌మెంట్ రికార్డు స్థాయిలో 3,999 యూనిట్లుకు చేరుకుంది. ఉత్పత్తి, ఎగుమతి ఇదే విధంగా పెరిగితే జపాన్‌లో నాలుగు సంవత్సరాల సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్‌ను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది.

