Maruti Suzuki : మారుతి సుజుకి చారిత్రక రికార్డు.. 42 ఏళ్లలో 3 కోట్ల కార్లు విక్రయించిన ఏకైక కంపెనీ!
42 ఏళ్లలో 3 కోట్ల కార్లు విక్రయించిన ఏకైక కంపెనీ!

Maruti Suzuki : భారతదేశంలో కార్ల తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి ఇండియా దేశంలో సరికొత్త విక్రయాల రికార్డును నెలకొల్పింది. 1983లో తొలి కారును విక్రయించినప్పటి నుంచి, గత 42 సంవత్సరాలలో కంపెనీ దేశీయంగా ఏకంగా 3 కోట్ల (30 మిలియన్) వాహనాలను విక్రయించినట్లు బుధవారం ప్రకటించింది. భారతదేశ ఆటోమొబైల్ చరిత్రలో ఇదొక చారిత్రక మైలురాయి. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఆల్టో, వ్యాగన్‌ఆర్, స్విఫ్ట్ వంటి మోడళ్లు కీలక పాత్ర పోషించాయి.
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో తిరుగులేని రికార్డును నెలకొల్పింది. మారుతి సుజుకి తన తొలి కోటి కార్ల విక్రయాల మైలురాయిని చేరుకోవడానికి 28 సంవత్సరాల 2 నెలలు పట్టింది. అయితే, రెండవ కోటి విక్రయాలను కేవలం 7 సంవత్సరాల 5 నెలల్లో పూర్తి చేసింది. మూడవ కోటి విక్రయాల రికార్డును మరింత వేగంగా కేవలం 6 సంవత్సరాల 4 నెలల్లోనే సాధించింది. మారుతి సుజుకి ఈ అద్భుతమైన విజయాన్ని సాధించడానికి కొన్ని మోడళ్లు కీలక పాత్ర పోషించాయి. అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా ఆల్టో నిలిచింది, దీని 47 లక్షల కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత, వ్యాగన్‌ఆర్ 34 లక్షలకు పైగా, స్విఫ్ట్ 32 లక్షలకు పైగా యూనిట్లతో అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఉన్నాయి.
బ్రెజా, ఫ్రాంక్స్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలు కూడా అత్యధికంగా అమ్ముడైన మోడళ్ల జాబితాలో చేరాయి. మారుతి సుజుకి ప్రయాణం 1983లో తొలి కారు మారుతి 800తో ప్రారంభమైంది. ఇది భారతదేశంలో ఆధునిక కార్ల శకానికి నాంది పలికింది. 1983 డిసెంబర్ 14న తొలి మారుతి 800 కారు అమ్ముడైంది. సంవత్సరాలు గడిచే కొద్దీ, కంపెనీ వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా తమ మోడళ్లను మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం మారుతి సుజుకి 19 మోడళ్లలో 170 కంటే ఎక్కువ వేరియంట్‌లను అందిస్తోంది.
మారుతి సుజుకి ఇటీవల లాంచ్ చేసిన కొత్త ఎస్‌యూవీ మోడల్ విక్టోరిస్కు కూడా మార్కెట్‌లో అద్భుతమైన స్పందన లభిస్తోంది. సెప్టెంబర్ 15, 2025న లాంచ్ అయిన విక్టోరిస్‌కు కేవలం రెండు నెలల్లోనే 30,000 కంటే ఎక్కువ ఆర్డర్‌లు వచ్చాయి. మొత్తం బుకింగ్‌లలో 53 శాతం వరకు నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌లకు రాగా, సుమారు 11,000 యూనిట్లతో సీఎన్‌జీ మోడళ్లు 38 శాతం బుకింగ్‌లను సాధించాయి.

