Maruti Suzuki: భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న మారుతి సుజుకి, అత్యంత వేగంగా పెరుగుతున్న ఎస్‌యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాబోయే ఐదేళ్ల కాలంలో ఏకంగా 7 సరికొత్త ఎస్‌యూవీ మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. యాన్యువల్ ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్ 2025-26లో ఈ వివరాలను వెల్లడించిన మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టేకౌచి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తి వ్యూహాలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.

తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్ల పెంపు

నూతన ఎస్‌యూవీల తయారీ, మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవడానికి మారుతి సుజుకి తమ తయారీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో సంస్థ వార్షిక ప్రొడక్షన్ కెపాసిటీని అదనంగా 5 లక్షల యూనిట్లకు విస్తరించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం బ్రెజ్జా, విక్టోరిస్, గ్రాండ్ విటారా వంటి పాపులర్ మోడళ్లతో మార్కెట్లో ఉన్న మారుతి, రాబోయే రోజుల్లో వేర్వేరు బడ్జెట్లు, విభిన్న రకాల ఫ్యూయల్ ఆప్షన్లలో (పెట్రోల్, సీఎన్జీ, హైబ్రిడ్, ప్రత్యామ్నాయ పవర్‌ట్రెయిన్స్) కొత్త ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనుంది.

చిన్న కార్ల సేల్స్, జిఎస్‌టీ ప్రోత్సాహం

కేవలం ఎస్‌యూవీలపైనే కాకుండా, భారతదేశంలో చిన్న కార్ల విక్రయాలు కూడా పుంజుకుంటాయని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్.సి. భార్గవ అంచనా ప్రకారం.. 2030-31 నాటికి భారత కార్ల మార్కెట్ పరిమాణం 6.1 మిలియన్ల నుంచి 6.3 మిలియన్ యూనిట్లకు చేరుకోనుంది. ఇటీవల చిన్న కార్లపై లభించిన జిఎస్‌టీ పన్నుల సడలింపు ఈ విభాగం వృద్ధికి ఎంతగానో దోహదపడిందని ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే రాబోయే ఐదేళ్లలో హ్యాచ్‌బ్యాక్ కార్ల విక్రయాలు వేగంగా పెరిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎగుమతుల్లో రికార్డు, భవిష్యత్ లక్ష్యాలు

ఆర్థిక సంవత్సరం 2025-26లో మారుతి సుజుకి ఏకంగా 24.2 లక్షల వాహనాలను విక్రయించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇందులో అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసిన 4.47 లక్షల వాహనాలు కూడా ఉన్నాయి. కేవలం దేశీయ మార్కెట్లోనే కాకుండా, విదేశీ ఎగుమతుల్లో కూడా మైలురాళ్లను అధిగమించడం తమ భవిష్యత్ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారుతుందని మారుతి సుజుకి నివేదికలో స్పష్టం చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story