Maruti Suzuki : నెలకు 24.5లక్షల కార్లకు సర్వీసింగ్..మారుతి సుజుకి రికార్డుల మోత
మారుతి సుజుకి రికార్డుల మోత

Maruti Suzuki : భారతదేశంలోని కార్ల విక్రయాల్లో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఇప్పుడు సర్వీసింగ్ రంగంలో కూడా కొత్త రికార్డు సృష్టించింది. గత మే నెలలో మారుతి తన చరిత్రలోనే తొలిసారిగా 24.5 లక్షలకు పైగా వాహనాలకు సర్వీస్ చేసి సరికొత్త మైలురాయిని అందుకుంది. ఇందులో పెయిడ్ సర్వీస్‌లు, ఉచిత సర్వీస్‌లు, చిన్న చిన్న రిపేర్‌లు అన్నీ కలిసి ఉన్నాయి. అంటే, నెలలో ప్రతిరోజూ 70,000లకు పైగా వాహనాలకు సర్వీస్ చేసినట్టు లెక్క. ఈ విషయాన్ని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకేయుచి వెల్లడించారు. ఈ భారీ సంఖ్య మారుతి సర్వీస్ నెట్‌వర్క్ ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగుపెడుతున్న మారుతి, వాటి సర్వీసింగ్ కోసం కూడా పెద్ద ప్రణాళికను సిద్ధం చేసింది. 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా 1,500 EV-రెడీ సర్వీస్ వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేయనున్నట్లు హిసాషి టకేయుచి తెలిపారు. ఈ వర్క్‌షాప్‌లు 1,000 కంటే ఎక్కువ నగరాల్లో విస్తరించి ఉంటాయి. ఇక్కడ EVలకు సంబంధించిన అన్ని అవసరాలను తీర్చడానికి ట్రైనింగ్ పొందిన ఉద్యోగులు, అధునాతన పరికరాలు అందుబాటులో ఉంటాయి.
ఈ ఈవీ-రెడీ వర్క్‌షాప్‌ల ప్రణాళిక, FY31 నాటికి 8,000 కొత్త సర్వీస్ టచ్‌పాయింట్‌లను విస్తరించే కంపెనీ ప్రణాళికలో భాగం. ప్రస్తుతం మారుతికి దేశవ్యాప్తంగా 5,400 సర్వీస్ టచ్‌పాయింట్స్ ఉన్నాయి. కంపెనీ ఎప్పుడూ బలమైన సర్వీస్ నెట్‌వర్క్‌ను నిర్మించడంపైనే దృష్టి పెట్టిందని టకేయుచి అన్నారు. కస్టమర్ సంతృప్తికి, నమ్మకానికి ఈ నెట్‌వర్క్ బలమైన పునాది అని కంపెనీ నమ్ముతుంది. డీలర్ పార్ట్‌నర్‌లతో కలిసి, మారుతి వర్క్‌షాప్‌లతో పాటు మొబైల్ వర్క్‌షాప్‌లు, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను కూడా అందిస్తోంది. ఇవి కస్టమర్‌లకు వారి ఇంటి వద్దకే లేదా రోడ్డుపై అత్యవసర పరిస్థితుల్లో సేవలను అందిస్తాయి.
సర్వీస్ ఆపరేషన్స్‌ను మరింత మెరుగుపరచడానికి, మారుతి AI ఆధారిత చాట్‌బాట్‌లు, వాయిస్‌బాట్‌లను కూడా ఉపయోగిస్తోంది. అలాగే, ఉద్యోగులకు కొత్త సాంకేతికతలు, సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్షణ ఇస్తోంది. తద్వారా కస్టమర్‌లకు వేగవంతమైన సర్వీసు లభిస్తుంది. మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కారు e-Vitaraను సెప్టెంబర్ 2025లో భారతదేశంలో విడుదల చేయనుంది. అయితే, 'రేర్ ఎర్త్ మాగ్నెట్' కొరత కారణంగా.. మారుతి సమీప భవిష్యత్తు కోసం ఉత్పత్తి లక్ష్యాన్ని మూడింట ఒక వంతు తగ్గించింది. e-Vitara కంపెనీ ఈవీ సెగ్మెంట్‌లో మొదటి మోడల్ కావడం దీనిపై వినియోగదారులలో చాలా ఆసక్తి ఉంది.
